Thursday, 28 June 2018

మార్చి 2018 వ్యక్తులు

వొడాఫోన్-ఐడియా విలీన సంస్థకు చైర్మన్‌గా కేఎం బిర్లాత్వరలో విలీనం కాబోయే వొడాఫోన్-ఐడియా సంస్థకు నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కుమార్ మంగళం బిర్లా బాధ్యతలు చేపడతారు. ఈ మేరకు ఐడియా ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌ను దాఖలు చేసింది. దీనిప్రకారం, బైలేశ్ శర్మ కొత్త సంస్థ సీఈఓగా ఉంటారు. శర్మ ప్రస్తుతం వొడాఫోన్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ రెండు సంస్థల విలీనంతో దేశంలో దాదాపు 23 బిలియన్ డాలర్ల విలువైన అతిపెద్ద టెలికం సంస్థ ఆవిర్భావం జరగనుంది. దీని మార్కెట్ వాటా దాదాపు 35 శాతం ఉంటుంది. 


ఇటలీ సంస్థకు డెరైక్టర్‌గా తెలుగు వైద్యుడు వికాస్‌గౌడ్
హైదరాబాద్‌కు చెందిన దంత వైద్య నిపుణులు డా. వికాస్‌గౌడ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఇటలీలోని 'యూనివర్సిటీ డెగ్లి స్టడీ ది జెనోవా' తొలిసారిగా తమ సంస్థకు డెరైక్టర్‌గా నియమించింది. భారతీయ వైద్యుడిని డెరైక్టర్‌గా నియమించడం ఇదే తొలిసారి. దంతవైద్యంలో ఇంప్లాంటాలజీలో అనుభవం గడించిన ఈయనను విద్యాబోధనకు గాను అక్కడ డెరైక్టర్ హోదా కల్పించినట్టు యూనివర్సిటీ తెలిపింది. 

దుమ్‌కా ఖజానా కేసులో లాలూకి 14 ఏళ్ల జైలు శిక్ష
1990ల్లో దుమ్‌కా ఖజానా నుంచి అక్రమంగా రూ.3.13 కోట్లు తీసుకున్న కేసులో బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు.. రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతోపాటుగా రూ.60 లక్షల జరిమానా విధించింది. ఐపీసీతో పాటుగా అవినీతి నిరోధక చట్టం కింద 2 వేర్వేరు కేసుల్లో ఏడేళ్ల చొప్పున జైలు శిక్షను సీబీఐ జడ్జి శివ్‌పాల్ మార్చి 24న ప్రకటించారు. ఈ రెండు శిక్షలు ఒకదాని తర్వాత మరొకటి అమలు చేయాలని ఆదేశించారు. 

ఆయుష్మాన్ భారత్ సీఈవోగా ఇందు భూషణ్
కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జాతీయ ఆరోగ్య భద్రతా పథకం 'ఆయుష్మాన్ భారత్'కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఇందు భూషణ్ నియమితులయ్యారు. ఆయన రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. అమెరికాలో హెల్త్ సెన్సైస్‌లో మాస్టర్స్, ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీ చేసిన భూషణ్ ప్రస్తుతం ఫిలిప్పీన్స్లోని మనీలా కేంద్రంగా పనిచేస్తున్న ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ) తూర్పు ఆసియా విభాగం డెరైక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
దేశంలోని ప్రతి పేద కుటుంబానికి ఏటా రూ.5 లక్షల మేర ఉచిత బీమా సౌకర్యం కల్పించడానికి ఉద్దేశించినదే 'ఆయుష్మాన్ భారత్' పథకం.


ఫోర్బ్స్ ఆసియా అండర్ 30 లో అనుష్క, పీవీ సింధు
ఫోర్బ్స్ మార్చి 27న విడుదల చేసిన '30 అండర్ 30 ఆసియా-2018' జాబితాలో బాలీవుడ్ నటి అనుష్క శర్మ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు చోటు సంపాదించారు. 30 ఏళ్ల లోపు వయసున్న నటీమణుల్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటిగా అనుష్క.. అతి తక్కువ కాలంలో అత్యధిక విజయాలు నమోదు చేసిన క్రీడాకారిణిగా పీవీ సింధులను ఫోర్బ్స్ అభివర్ణించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ జాబితాలో 300 మందికి స్థానం దక్కింది. భారత్ నుంచి మోడల్ భూమికా అరోరా, సైనప్ సీఈఓ అశ్విన్ రమేష్, అథ్లెట్ శ్రుతి మంథన, హేడేకేర్ ఫౌండర్ దీపాంజలి దాల్మియా, హెల్త్‌సెట్‌గో ఫౌండర్ ప్రియా ప్రకాష్ వంటి యువ వాణిజ్యవేత్తలు, టెక్నోక్రాట్లకు కూడా చోటు దక్కింది. 

మయన్మార్ అధ్యక్షుడు రాజీనామా
మయన్మార్ అధ్యక్ష పదవి నుంచి హితిన్ క్యా వైదొలిగారు. బాధ్యతలు, విధులు నుంచి విశ్రాంతి తీసుకునేందుకే ఆయన పదవికి రాజీనామా చేశారని ఆ దేశ అధ్యక్ష కార్యాలయ వర్గాలు మార్చి 20న వెల్లడించాయి. మయన్మార్ రాజ్యాంగం ప్రకారం..అధ్యక్షుడు రాజీనామా చేస్తే ఉపాధ్యక్షుడు ఆ బాధ్యతలను చేపడతారు. పార్లమెంటు ఏడు రోజుల్లోగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. 

ఏఐఈపీఎఫ్‌ఎస్‌ఎఫ్ చీఫ్ ప్యాట్రన్‌గా వినోద్ కుమార్
ఆల్ ఇండియా ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ స్టాఫ్ ఫెడరేషన్ (ఏఐఈపీఎఫ్‌ఎస్‌ఎఫ్) చీఫ్ ప్యాట్రన్‌గా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఎంపీ వినోద్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. న్యూఢిల్లీలో మార్చి 21న 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి హాజరైన ఈపీఎఫ్ ఉద్యోగులు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

అప్పీ ఫిజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా సల్మాన్ ఖాన్ బేవరేజ్ దిగ్గజం పార్లే ఆగ్రో తాజాగా బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా సల్మాన్ ఖాన్.. పార్లే ఆగ్రోకు చెందిన అప్పీ ఫిజ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారు. దేశవ్యాప్తంగా మరింత మంది వినియోగదారులకు అప్పీ ఫిజ్‌ను చేరువ చేయాలనే లక్ష్యంతోనే సల్మాన్ ఖాన్‌తో జతకట్టామని పార్లే ఆగ్రో పేర్కొంది. కాగా సల్మాన్ ఖాన్ ఇకముందు అప్పీ ఫిజ్ బ్రాండ్ ప్రచార చిత్రాల్లో కనిపిస్తారు. ఇక పార్లే ఆగ్రోకు ఫ్రూటీ, అప్పీ, ఫ్రూటీ ఫిజ్, అప్పీ ఫిజ్ వంటి పలు బ్రాండ్‌‌స ఉన్నాయి.

చైనా శాశ్వత అధ్యక్షుడిగా జిన్‌పింగ్
చైనా అధ్యక్షుడిగా షి జిన్‌పింగ్ రెండోసారి మళ్లీ ఎన్నికయ్యారు. ఆ దేశ రాజ్యాంగంలో అధ్యక్షుడు రెండు సార్లు మాత్రమే పదవిలో ఉండే నిబంధనను ఎత్తివేస్తూ ఇటీవల చైనా పార్లమెంటు నిర్ణయం తీసుకుంది. దీంతో రెండో పర్యాయం అధ్యక్షుడిగా ఎన్నికై న జిన్‌పింగ్ (64) అయిదేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత కూడా జీవితకాలం అధ్యక్షుడిగా కొనసాగేందుకు అవకాశం లభించింది. చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ) అధినేతగా కూడా జిన్‌పింగ్ ఎంపికయ్యారు. ఇప్పటికే ఆయన అధికార చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. జిన్‌పింగ్ విధేయుడు, సన్నిహితుడు వాంగ్ క్విషాన్ (69) చైనా ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వాంగ్ ఎన్నికపై పలు విమర్శలు వస్తున్నాయి. 68 ఏళ్లు నిండిన వారు పదవీ విరమణ చేయడం సంప్రదాయం.

వివో బ్రాండ్ అంబాసిడర్‌గా అమీర్ ఖాన్
వివో బ్రాండ్ మొబైల్ ఫోన్లకు ప్రముఖ హిందీ సినిమా నటుడు అమీర్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు అమీర్ ఖాన్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని వివో ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ కెన్నీ జెంగ్ తెలిపారు. వివో బ్రాండ్ కింద భవిష్యత్తులో రానున్న మోడళ్లకు అమీర్ ఖాన్ ప్రచారం చేస్తారని, ఆయనతో త్వరలోనే ఒక టీవీ కమర్షియల్‌ను తెస్తామని వివరించారు. 


రష్యా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన పుతిన్
అమెరికా, బ్రిటన్‌లతో తీవ్రమైన విభేదాలు నెలకొన్న నేపథ్యంలో రష్యన్లు మరోసారి వ్లాదిమిర్ పుతిన్(65)కే పట్టం కట్టారు. దేశవ్యాప్తంగా మార్చి 18న ముగిసిన అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌కు 76.67 శాతం ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి కమ్యూనిస్ట్ పార్టీ నేత పావెల్ గ్రుడినిన్‌కు 11.79 శాతం ఓట్లు వచ్చాయి. తాజా విజయంతో 2024 వరకూ పుతిన్ రష్యా అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. అంతేకాకుండా నియంత జోసెఫ్ స్టాలిన్ (24 ఏళ్లు) తర్వాత అత్యధికకాలం రష్యాను పాలించిన నేతగా పుతిన్ రికార్డు సృష్టించారు. 
2014లో ఉక్రెయిన్ నుంచి రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియాలో పుతిన్‌కు 92 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి అలెక్సీ నావెల్నీపై రష్యా ఎన్నికల సంఘం వేటు వేయడంతో పుతిన్ విజయం లాంఛనప్రాయమైంది. 

కేజీబీ టు క్రెమ్లిన్ 
రష్యా నేత పుతిన్ అధ్యక్ష ఎన్నికల్లో సాధించిన ఘన విజయం 2024 వరకూ ఆయన పదవిలో కొనసాగడానికి అవకాశమిచ్చింది. రష్యా రాజ్యాంగం ప్రకారం వరుసగా రెండు సార్లు మించి ఏ నేతా అధ్యక్ష పదవి చేపట్టకూడదు. దాని ప్రకారం 2024 ఎన్నికలు వదిలేసి 2030లో ఆయన అధ్యక్ష పదవికి పోటీచేయొచ్చు. 

వ్యూహ రచనలో దిట్ట! 
నిఘా సంస్థ కేజీబీలో ఓ అధికారి స్థాయి నుంచి రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ సెనెట్ వరకూ సాగిన పుతిన్ ప్రయాణం అసామాన్యం. పుతిన్ అధ్యక్షుడిగా ఉన్న మొదటి ఎనిమిదేళ్లలో (2000-2008) రష్యా ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టింది. ఆ రోజుల్లో భారీగా పెరిగిన ముడి చమురు, సహజ వాయువు ధరల ఫలితంగా సంపన్నులు సహా రష్యన్ల ఆదాయాలు గణనీయంగా పెరిగాయి. దీంతో ఆయన తన అధికారం సుస్థిరం చేసుకోగలిగారు. ప్రభుత్వంపై తిరుగులేని పట్టు సంపాదించారు. మొదట రాజకీయ పలుకుబడి ఉన్న బడా పారిశ్రామికవేత్తలను, తర్వాత ప్రతిపక్ష నేతలను నిరాధార ఆరోపణలతో దెబ్బతీశారు. వారిలో కొందరిని దేశం నుంచి బహిష్కరించారు. రష్యాలో రాజకీయాలు లేని ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుకు పుతిన్ చేసిన ప్రయత్నం ఫలించింది. ‘ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తా. మీరు రాజకీయాలకు దూరంగా ఉండండి’ అన్న పుతిన్ మాటలను సామాన్య ప్రజానీకం, కార్మికవర్గం నమ్మడంతో పుతిన్ అధికారానికి అడ్డంకులు లేకుండా పోయాయి. అయితే, గత ఆరేళ్లలో పాశ్చాత్యదేశాల ఆంక్షల ఫలితంగా రష్యా ఆర్థిక సమస్యలు తీవ్రమయ్యాయి. అయినప్పటికీ సిరియా అంతర్యుద్ధంలో జోక్యం, క్రిమియా ఆక్రమణ ద్వారా దేశాన్ని పుతిన్ అగ్రరాజ్యం దిశగానే నడిపిస్తున్నారని రష్యన్లు విశ్వసిస్తున్నారు. కాగా, పుతిన్‌కు తొలినాళ్లలో ప్రజాదరణ ఉన్నప్పటికీ ఇప్పుడు జరిగే ప్రతీ ఎన్నికల్లోనూ రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని ప్రతిపక్షాలు, పరిశీలకులు ఆరోపిస్తున్నారు. 


అణచివేయడంలో ఘటికుడు
ప్రధాన ప్రత్యర్థులను అణచివేయడం, అక్రమంగా జైలుకు పంపడం, ఎన్నికల్లో పోటీచేయకుండా అనర్హులను చేయడం పుతిన్‌కు కొట్టిన పిండి. 1952లో లెనిన్‌గ్రాడ్‌లో జన్మించిన పుతిన్ సెయింట్ పీటర్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదువుకున్నారు. 1975లో కేజీబీలో ఇంటెలిజెన్‌‌స అధికారిగా ఉద్యోగంలో చేరి వేగంగా లెఫ్టినెంట్ కల్నల్ స్థాయికి ఎదిగారు. రాజకీయాలపై ఆసక్తితో 1991లో ఉద్యోగానికి రాజీనామా చేసి మకాం రాజధాని మాస్కోకు మార్చారు. యునెటైడ్ రష్యా పార్టీ నేత అయిన పుతిన్‌కు ప్రధానిగా తొలి అవకాశం అధ్యక్షుడు బోరిస్ ఎలిత్సిన్ ఇచ్చారు. 1999లో అప్పటి ప్రధాని సెర్జీ స్టెపాషిన్‌ను బర్తరఫ్ చేసి పుతిన్‌ను ప్రధానమంత్రిగా ప్రమోట్ చేశారు. అదే ఏడాది డిసెంబర్‌లో రాజీనామా చేసిన ఎలిత్సిన్ తాత్కాలిక అధ్యక్షునిగా పుతిన్‌ను నియమించారు. 2000 అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ తన సమీప కమ్యూనిస్ట్ ప్రత్యర్థి గెనడీ జ్యుగనోవ్‌పై విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో 72 శాతం ఓట్లు సాధించి రెండోసారి అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. 2008లో ప్రధానిగా నియమితులయ్యారు. 2011లో అధ్యక్ష పదవీకాలా న్ని నాలుగు నుంచి ఆరేళ్లకు పెంచారు. ఈ చట్ట సవరణ చేశాక 2012లో పుతిన్ మూడోసారి అధ్యక్షపదవికి పోటీచేసి 64 శాతం ఓట్లతో గెలిచారు. తాజా విజయంతో పుతిన్ నియంత జోసెఫ్ స్టాలిన్ తర్వాత రష్యాను ఎక్కువ కాలం పాలించిన నేతగా చరిత్రలో స్థానం సంపాదించుకున్నారు.

జర్మనీ ఛాన్సలర్‌గా ఎన్నికైన మెర్కెల్
ఏంజెలా మెర్కల్ మార్చి 14న జర్మనీ ఛాన్సలర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. కాగా, ఆమె ఈ పదవిని చేపట్టడం ఇది వరుసగా నాలుగోసారి. 709 మంది సభ్యులున్న జర్మన్ పార్లమెంటులో 364 మంది ఆమెకు అనుకూలంగా ఓటేశారు.

నేపాల్ అధ్యక్షురాలిగా విద్యాదేవి తిరిగి ఎన్నిక
విద్యాదేవి భండారీ రెండోసారి నేపాల్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆమె మార్చి 13న జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. భండారీ 2015లో నేపాల్ తొలి మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

యూఎస్ విదేశాంగ మంత్రిగా మైక్ పాంపీ 
అమెరికా విదేశాంగ శాఖ మంత్రిగా మైక్ పాంపీ నియమితులయ్యారు. రెక్స్ టిల్లర్సన్ స్థానంలో పాంపీని నియమిస్తున్నట్లుఅధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మార్చి 13న ప్రకటించారు. జాతీయ భద్రతకు సంబంధించి ఉత్తర కొరియాతో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ట్రంప్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న మైక్ పాంపీని విదేశాంగ మంత్రిగా నియమించారు.

అత్యంత సంపన్న ఎంపీగా జయాబచ్చన్ 
దేశంలోనే అత్యంత సంపన్న ఎంపీగా జయాబచ్చన్ నిలవనున్నారు. ప్రముఖ నటి, సమాజ్‌వాదీ పార్టీ నాయకురాలైన జయాబచ్చన్ యూపీ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె మార్చి 12న సమర్పించిన ప్రమాణపత్రంలో ఆస్తుల విలువను రూ.1000 కోట్లుగా పేర్కొన్నారు. కాగా, ఇప్పటి వరకు దేశంలోనే అత్యంత సంపన్న ఎంపీగా భాజాపాకు చెందిన రవీంద్ర కిశోర్ సిన్హా గుర్తింపు పొందారు. ఆయన 2014లో రాజ్యసభకు ఎన్నికయ్యే నాటికి ఆస్తుల విలువను రూ.800 కోట్లుగా ప్రకటించారు.

నాగాలాండ్ సీఎంగా రియో ప్రమాణం నాగాలాండ్ ముఖ్యమంత్రిగా నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ నేత నీఫియు రియో బాధ్యతలు స్వీకరించారు. మార్చి 8న ఆ రాష్ట్ర గవర్నర్ ఆచార్య.. రియోతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ నేత పాట్టూన్ ప్రమాణం చేశారు. వీరుకాక మరో 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీతో కలసి పీపుల్స్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వాన్ని రియో ఏర్పాటు చేశారు. 
నాగాలాండ్ సీఎంగా రియో బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగోసారి.


త్రిపుర సీఎంగా విప్లవ్ ప్రమాణం 
సుమారు పాతికేళ్ల కమ్యూనిస్టుల పాలన అనంతరం త్రిపురలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా విప్లవ్ కుమార్ దేవ్(48) మార్చి 9న ప్రమాణం చేశారు. అగర్తలాలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తథాగతరాయ్ విప్లవ్‌తో సీఎంగా ప్రమాణం చేయించారు. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ , కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్, బీజేపీ నాయకులు అడ్వాణీ, ఎంఎం జోషి, తాజా మాజీ సీఎం మాణిక్ సర్కార్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. విప్లవ్‌తో పాటు బీజేపీకే చెందిన జిష్ణు దేవ్ వర్మన్ ఉప ముఖ్యమంత్రిగా, మరో ఏడుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. 


ఉబెర్ బ్రాండ్ అంబాసిడర్‌గా కోహ్లి
అంతర్జాతీయ ట్యాక్సీ సేవల సంస్థ ‘ఉబెర్’ తాజాగా ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లిని భారత్‌లో బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. డీల్‌లో భాగంగా ఇకపై ఉబెర్ ఇండియా మార్కెటింగ్, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ప్రచార కార్యక్రమాల్లో కోహ్లి పాల్గొంటారు. ఉబెర్ సంస్థ ఆసియా-పసిఫిక్‌లో బ్రాండ్ అంబాసిడర్‌ను నియమించుకోవడం ఇదే ప్రథమం. గత నెల ఫుట్‌బాల్ ప్లేయర్ మహమద్ సలాహ్‌ను ఈజిప్ట్ మార్కెట్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది.


ట్వీటర్ సీటీవోగా పరాగ్ అగర్వాల్
మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘ట్వీటర్’ తాజాగా పరాగ్ అగర్వాల్‌ను చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా (సీటీవో) నియమించుకుంది. ఈయన ఆడమ్ మెస్జింగర్ స్థానాన్ని భర్తీ చేశారు. ఆడమ్ మెస్జింగర్ 2016 చివరిలో కంపెనీ నుంచి బయటకు వచ్చేశారు. ఇకపోతే అగర్వాల్ ఐఐటీ-బాంబే పూర్వ విద్యార్థి. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ లో పీహెచ్‌డీ పూర్తిచేశారు. ఈయన 2011లో యాడ్‌‌స ఇంజనీర్‌గా ట్వీటర్‌లో చేరారు. ట్వీటర్‌లో చేరకముందు మైక్రోసాఫ్ట్ రీసెర్చ్, యాహూ రీసెర్చ్, ఏటీఅండ్‌టీ ల్యాబ్స్‌తో కలసి డేటా మేనేజ్‌మెంట్‌పై రీసెర్చ్ చేశారు. 


నేపాల్ అధ్యక్షురాలిగా విద్యా దేవి భండారీ
నేపాల్ అధ్యక్షురాలిగా విద్యా దేవి భండారీ(56) మార్చి 13న రెండోసారి ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షురాలు, లెఫ్ట్ కూటమి అభ్యర్థి అయిన భండారీ.. నేపాలీ కాంగ్రెస్ అభ్యర్థి కుమారి లక్ష్మీ రాయ్‌పై గెలుపొందారు. ఎన్నికల్లో భండారీకి 39,275 ఓట్లు, లక్ష్మీ రాయ్‌కు 11,730 ఓట్లు దక్కాయి. 1994, 1999లో రెండు సార్లు నేపాల్ పార్లమెంట్‌కు ఎన్నికైన భండారీ 2015లో నేపాల్ తొలి మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు.


మహారాష్ట్ర రైతు మార్చ్ సారథులు వీరే
మహారాష్ర్టలో దాదాపు 50 వేల మంది రైతులు, ఆదివాసీలు 180 కిలోమీటర్లు నడిచి ముంబై చేరుకొని శాంతియుతంగా ఉద్యమించడం వెనుక నలుగురు సారథులు ఉన్నారు. వారే సీపీఎం ఎమ్మెల్యే జీవా పాండు గావిట్, ఏబీకేఎస్ అధ్యక్షుడు అశోక్ ధావలే, ఏబీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి అజిత్ నవ్‌లే మరియు ఏబీకేఎస్ సంయుక్త కార్యదర్శి విజూ కృష్ణన్. ఈ ఉద్యమంలో ఎలాంటి అపశృతి చోటు చేసుకోకుండా క్రమశిక్షణతో, శాంతియుతంగా ప్రభుత్వం నుంచి హామీలు పొంది విజయవంతంగా ముగించడంలో వీరు సఫలమయ్యారు.
జీవా పాండు గావిట్: నాసిక్ జిల్లాలోని కాల్వన్ నియోజకవర్గానికి గావిట్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుత మహారాష్ట్ర శాసనసభలో కమ్యూనిస్టు పార్టీలకు చెందిన ఏకై క ఎమ్మెల్యే ఈయనే. అంతేకాదు కాల్వన్ నుంచి ఆయన ఏడుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. తరాల నుంచి సాగుచేస్తున్న అటవీ భూములను తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేస్తూ రైతు పాదయాత్రకు వ్యూహ రచన చేసింది ఈయనే.
అశోక్ ధావలే: రైతుల పోరాటానికి నేతృత్వం వహించింది అఖిల భారతీయ కిసాన్ సభ (ఏబీకేఎస్). సీపీఎం అనుబంధ సంస్థ అయిన ఏబీకేఎస్‌కు అశోక్ ధావలే ఇటీవలే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈయన సామాజిక కార్యకర్త గోదావరి పారులేకర్ సిద్ధాంతాలను గట్టిగా నమ్ముతారు. 1993 నుంచి ఠాణే, పాల్ఘర్ జిల్లాల్లో రైతు సమస్యలపై ధావలే పోరాటాలు సాగిస్తున్నారు. దశాబ్దం క్రితం రాయ్‌గఢ్‌లో ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)కి భూసేకరణను, తాజాగా ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు, ముంబై-నాగపూర్ ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టులకు భూసేకరణను కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 
అజిత్ నవ్‌లే: 2017 జూన్‌లో రైతుల చేత ఆందోళనలు చేయించి ప్రభుత్వం రైతు రుణమాఫీని ప్రకటించేలా చేయడంలో అజిత్ నవ్‌లే పాత్ర ఎంతో కీలకం. ఆ తర్వాత రైతు రుణ మాఫీ విధి విధానాలు ఎలా ఉండాలో నిర్ణయించేందుకు ప్రభుత్వం ఓ కమిటీని నియమించి అజిత్‌ను కూడా అందులో సభ్యుడిగా చేర్చింది.
విజూ కృష్ణన్: కేరళకు చెందిన, ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) పూర్వ విద్యార్థి అయిన విజూ కృష్ణన్ పాత్ర కూడా రైతు పాదయాత్ర విజయవంతం కావడంలో కీలకమైనది. 1946లో కేరళలోని కన్నూర్ సమీపంలోని కరివేల్లూరు అనే గ్రామంలో రైతులు బ్రిటిష్ వారి సామ్రాజ్య, భూస్వామ్య విధానాలపై తిరుగుబాటు చేశారు. విజూ కృష్ణన్ కూడా అదే గ్రామానికి చెందిన వారు. దాదాపు 70 ఏళ్ల తర్వాత అలాంటి డిమాండ్లతోనే మహారాష్ట్ర రైతులు ఉద్యమిస్తుండటంతో ఆయన వారితో జతకలిశారు.


ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కన్నుమూత విశ్వవిఖ్యాత ఖగోళ, సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ (76) కన్నుమూశారు. బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం సమీపంలో గల తన ఇంట్లో మార్చి 13న తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ‘మా నాన్న మరణం మమ్మల్ని తీవ్ర వేదనకు గురిచేస్తోంది. ఆయన గొప్ప శాస్త్రజ్ఞుడు. అంతకుమించి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన మనిషి. ఆయన పరిశోధనలు, ఆవిష్కరణలను రాబోయే తరతరాలు గుర్తుంచుకుంటాయి. నాన్న మరణం మా కుటుంబానికే కాదు, యావత్ ప్రపంచానికి తీరని లోటు’ అని హాకింగ్ ముగ్గురు పిల్లలు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌లో 1942, జనవరి 8న జన్మించిన స్టీఫెన్ విలియం హాకింగ్ అతి తక్కువ కాలంలోనే అల్బర్ట్ ఐన్‌స్టీన్, సర్ ఐజాక్ న్యూటన్ వంటి శాస్త్రవేత్తల సరసన నిలిచారు. 1964లో 22 ఏళ్ల వయసులో హాకింగ్‌కు అమియోమోట్రోపిక్ లాటరల్ స్లైరోసిస్ వ్యాధి సోకడంతో కొన్నేళ్లకే మరణిస్తాడని అందరూ అనుకున్నారు. నరాలు, వెన్నుపూసపై ప్రభావం చూపే ఈ వ్యాధి అతన్ని చలన రహితున్ని (పక్షవాతం)చేసింది. 1985లో నిమోనియా రావడంతో పూర్తిగా వీల్ చైర్‌కే పరిమితమయ్యారు. శరీరం అంతా పక్షవాతం రావడంవల్ల చేతి చిటికెన వేలి కదలికల సాయంతో ట్రేడ్‌మార్క్ వాయిస్ సింథసైజర్ ద్వారా తన ఆలోచనలను తెలిపేవారు. 32 ఏళ్ల ప్రాయంలో అత్యంత చిన్న వయసు కలిగిన సైంటిస్టులలో ఒకరిగా బ్రిటన్ ప్రతిష్టాత్మక శాస్త్రీయ సంస్థ అయిన రాయల్ సొసైటీ హాకింగ్‌ను గుర్తించింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఆస్ట్రానమీ (ఖగోళ శాస్త్రం), కాస్మాలజీ (విశ్వనిర్మాణ శాస్త్రం)లను అధ్యయనం చేసిన హాకింగ్, 1979లో కేంబ్రిడ్జి యూనివర్సిటీలో మాథమాటిక్స్ లుకేసియన్ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. హాకింగ్స్‌కి ముందు ఈ హోదాలో న్యూటన్ పనిచేశారు.
హాకింగ్ పరిశోధనలు
1970: ఈ విశ్వం మొత్తం సింగుల్యారిటీ ద్వారా ఏర్పడింది. మనకు కనిపిస్తున్న గ్రహాలు, నక్షత్రాలు అన్నిరకాల ఇతర పదార్థాలు కంటికి కనిపించనంత చిన్న గుళిక స్థాయికి కుంచించుకుపోతే అప్పుడు విశ్వం సాంద్రత, బరువు అనంతమవుతాయి. అంతరిక్షం, కాలం అన్నీ అందులోనే ఇమిడి ఉంటాయి. ఈ భావనను సింగ్యులారిటీ అంటారు.
1972-74 కృష్ణబిలాల యంత్రాంగం: విశ్వంలో అక్కడక్కడా అదృశ్యంగా ఉండే కృష్ణబిలాల నుంచి కూడా రేడియోధార్మికత వెలువడుతూ ఉంటుందని ప్రతిపాదన. 
1981 ఇన్ఫర్మేషన్ పారడాక్స్: కృష్ణబిలంలోకి వెళ్లే పదార్థం, సమాచారం ఏదైనా సరే.. అది ఆవిరి అవడంతో ఎవరికీ అందకుండా పోతుంది. 
1983 అనంత విశ్వం: అంతరిక్షం-కాలాలకు సంబంధించి ఈ విశ్వానికి సరిహద్దులు లేవు 
1988 కాలం: కాలమనేది దూసుకుపోతున్న మూడు బాణాల వంటిదని హాకింగ్ అంచనా వేశారు. థెర్మోడైనమిక్స్ ఒక బాణమైతే... మిగిలిన రెండు ఖగోళ, మానసిక సంబంధమైనవి. 
2006: ఈ విశ్వం వేర్వేరు స్థితుల నుంచి ఉనికిలోకి వచ్చింది. 
హాకింగ్ ఇంటర్వ్యూల్లో చెప్పిన కొన్ని సత్యాలు
నా లక్ష్యం చాలా సింపుల్. ఈ విశ్వం గురించి సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. విశ్వం ఇప్పుడున్నట్లే ఉండేందుకు కారణమేంటి? అసలు.. ఎందుకుంది? వంటి ప్రశ్నలకు జవాబులు వెతకాలి.
మనం భూమిని ఖాళీ చేయాల్సిన సమయం ఎంతో దూరంలో లేదు. మరో వందేళ్లలోనే మనం నివాసయోగ్యంగా ఉండే మరో గ్రహాన్ని వెతుక్కోవాలి. మితిమీరిన జనాభా, వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులు, భూమికి అత్యంత సమీపంగా వస్తున్న గ్రహశకలాలతో ఇక భూమిపై జీవించడం దుర్లభంగా మారుతుంది’ - బీబీసీ డాక్యుమెంటరీ కిచ్చిన ఇంటర్వ్యూలో
మరణం తర్వాత జీవితం లేదు. స్వర్గం, నరకం అన్నవి అసలే లేవు. చావు అంటే భయం ఉన్నవారి కోసం అలాంటి కట్టు కథలు అల్లారు. మన మెదడు ఒక కంప్యూటర్ లాంటిది. కంప్యూటర్‌లో విడిభాగాలు పాడైతే అదెలా పనిచేయదో మెదడు కూడా అంతే.. పనిచేయడం ఆగిపోతుంది. నాకు చావంటే భయం లేదు. అలాగని వెంటనే మరణించాలని లేదు. నేను కన్నుమూసేలోపు చేయాల్సింది చాలా ఉంది. జీవించి ఉన్న సమయంలోనే మనలోని శక్తి సామర్థ్యాల్ని సమర్థంగా వినియోగించుకోవాలి. -2011లో గార్డియన్ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో 
హాకింగ్ 5 అద్భుత రచనలు 
మై బ్రీఫ్ హిస్టరీ: ఇది హాకింగ్ ఆత్మకథ లాంటిది. లండన్‌లో హాయిగా సాగిన తన బాల్యం.. బెట్స్ కడుతూ తన మిత్రులతో సరదాగా గడిచిన యవ్వనం.. మేధావిగా, ప్రఖ్యాత సైద్ధాంతిక శాస్త్రవేత్తగా తన పరిణామం.. ఈ వివరాలన్నింటినీ ‘మై బ్రీఫ్ హిస్టరీ’లో ఆసక్తికరంగా హాకింగ్ వివరిస్తారు. పాఠకులకు తెలియని ఒక కొత్త హాకింగ్‌ను, సరదాపరుడు, చతురుడైన హాకింగ్‌ను ఈ పుస్తకంలో ఆయన పరిచయం చేస్తారు. ఇందులోని అరుదైన ఫొటోగ్రాఫ్‌లు పాఠకులకు అదనపు ఆసక్తిని కలిగిస్తాయి. 
ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్: భౌతిక, ఖగోళ సిద్ధాంతాలు సామాన్యులకు అర్థమయ్యే లా హాకింగ్ ఈ పుస్తకాన్ని 1988లో రాశారు. ఇందులో విశ్వం ఆవిర్భావం, విస్తరణ, అంతరిక్షం, కాలంతో పాటు గురుత్వాకర్షణ, కృష్ణబిలాలను సరళమైన రీతిలో హాకింగ్ వివరించారు. 2001 నాటికి 35 భాషల్లో తర్జుమా అయింది. 
ది గ్రాండ్ డిజైన్: ఈ పుస్తకాన్ని లియోనార్డ్ మ్లోడినౌ అనే మరో భౌతికశాస్త్రవేత్తతో కలసి హాకింగ్ 2010లో రచించారు. బిగ్‌బ్యాంగ్(విశ్వ ఆవిర్భావం) భౌతికశాస్త్ర నియమాల ఆధారంగానే జరిగిందనీ, ఇందులో దేవుడి పాత్రేమీ లేదని ఈ పుస్తకంలో హాకింగ్ స్పష్టం చేశారు. విశ్వం పుట్టుకను తెలుసుకునేందుకు దేవుడ్ని అన్వేషించాల్సిన అవసరం లేదన్నారు. ‘దేవుడు లేడని ఎవ్వరూ నిరూపించలేరు. కానీ సైన్స్ దేవుడి అవసరం లేకుండా చేస్తుంది’ అని అన్నారు. 
యూనివర్స్ ఇన్ ఏ నట్‌షెల్: ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ పుస్తకానికి సీక్వెల్‌గా హాకింగ్ దీన్ని 2001లో రాశారు. ఇందులో తన పరిశోధనలతో పాటు క్వాంటమ్ మెకానిక్స్, ఆధునిక భౌతికశాస్త్ర సిద్ధాంతాలు, ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్తలైన ఐన్‌స్టీన్, రిచర్డ్ ఫైన్‌మెన్‌ల సిద్ధాంతాలను ఇందులో హాకింగ్ వివరించారు. ఈ పుస్తకం 2002లో అవెన్టిస్ ప్రైజ్‌కు ఎంపికై ంది.
జార్జ్‌స్ సీక్రెట్ కీ టు యూనివర్స్: కుమార్తె లూసీతో కలసి హాకింగ్ 2007లో చిన్నారుల కోసం రాసిన పుస్తకమిది. ఇందులో కాస్మోస్ అనే శక్తిమంతమైన కంప్యూటర్ సాయంతో చిన్నారులు సుసన్, రింగో, ఎరిక్, జార్జ్‌లతో పాటు డా.రీపర్ సాహసాలు చేస్తారు. కథల రూపంలో విశ్వంలోని సంక్లిష్ట అంశాలను సులభంగా అర్థమయ్యేలా హాకింగ్ ఇందులో వివరించారు.

కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మృతి కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి శివైక్యం పొందారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. కాంచీపురంలోని ఓ ఆస్పత్రిలో ఫిబ్రవరి 28న ఉదయం 9 గంటలకు జయేంద్ర తుదిశ్వాస విడిచారు. 

కంచి మఠానికి 69వ పీఠాధిపతి
జయేంద్ర సరస్వతి 19 ఏళ్ల వయస్సులోనే కంచి మఠానికి యువ పీఠాధిపతిగా పట్టాభిషక్తులయ్యారు. 1935 జూలై 18వ తేదీ తమిళనాడులోని నేటి తంజావూరు జిల్లాలోని ఇరుల్‌నీక్కి గ్రామంలో జన్మించిన జయేంద్ర సరస్వతి అసలు పేరు సుబ్రహ్మణ్య మాదే అయ్యర్. చిన్న తనంలోనే హిందూ మత పెద్దలతో కలిసి ఆధ్యాత్మిక బాటలో నడిచారు. అప్పటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతిస్వామి సుబ్రహ్మణ్య మాదే అయ్యర్‌ను 19 ఏళ్ల వయస్సుల్లో జయేంద్ర సరస్వతిగా నామకరణం చేస్తూ 1954లో మార్చి 22న కంచిమఠానికి 69వ పీఠాధిపతిని చేశారు.

70వ పీఠాధిపతిగా శంకర విజయేంద్ర 
జయేంద్ర సరస్వతి శివక్యైం పొందడంతో కంచి కామకోటి మఠం 70వ పీఠాధిపతిగా శంకర విజయేంద్ర సరస్వతికి పట్టాభిషేకం చేయనున్నారు. ఈయన అసలు పేరు శంకరనారాయణన్. 1969 మార్చి 18న జన్మించారు. తిరువళ్లూరు జిల్లా ఆరణి సమీపంలోని పెరియపాళయం గ్రామం ఆయన స్వస్థలం. 1983 మే 29న పోలూరులో ఆధ్యాత్మిక గురువయ్యారు. 

డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన హర్మన్ ప్రీత్‌కౌర్ 
భారత మహిళల టి20 క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పంజాబ్ పోలీస్ శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పొలీస్ (డీఎస్పీ)గా మార్చి 1న బాధ్యతలు స్వీకరించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సురేశ్ అరోరా ఆమె యూనిఫామ్‌కు బ్యాడ్జిలను అలంకరించి అభినందనలు తెలిపారు.
మహిళల వన్డే ప్రపంచ కప్‌లో హర్మన్ ప్రీత్ అద్భుత ప్రదర్శనకు గాను ఆమెకు పంజాబ్ ప్రభుత్వం ఉద్యోగాన్ని ఇచ్చింది. 


ప్రముఖ కవి నాయని కృష్ణమూర్తి కన్నుమూత ప్రముఖ కవి, సాహితీవేత్త, విజయవాణి ప్రింటర్స్, విజయవాణి విద్యా సంస్థల అధినేత నాయని కృష్ణమూర్తి (67) మరణించారు. గత కొన్ని రోజులుగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో మార్చి 1న తుదిశ్వాస విడిచారు. 
చిత్తూరు జిల్లా నడిమిచెర్లలో 1951లో కృష్ణమూర్తి జన్మించారు. బాల్యం నుంచే సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్న నాయని తన 23 ఏళ్ల వయసులో యామినీ కుంతలాలు అనే నవల రాశారు. ఈ నవలకు 1974 ఉగాది నవలల పోటీలో తృతీయ బహుమతి లభించింది. అనంతరం కొంతకాలం బొమ్మరిల్లు, విజయ,నీలిమ పత్రికలకు ఉపసంపాదకులుగా పనిచేశారు. పిల్లల పత్రిక స్నేహబాలను నడిపించారు. సోదరులతో కలిసి మాబడి, పాఠశాల మాసపత్రికలను నిర్వహించారు. తద్వారా గ్రామీణప్రాంత విద్యార్థుల విద్యాభ్యాసానికి తోడ్పడ్డారు. సాక్షరతా సమితి అకడమిక్ కమిటీ చైర్మన్ పదుహేను సంవత్సరాలు పనిచేశారు. నిరంతర విద్యాకేంద్రాలకు వెలుగుబాట వారపత్రికను అందించారు. 

పాక్‌లో సెనేటర్‌గా కృష్ణకుమారి కొహ్లి
పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్‌‌సకు చెందిన కృష్ణకుమారి.. ఆ దేశ సెనెట్‌కు ఎన్నికై న తొలి హిందూ దళిత మహిళగా రికార్డుకెక్కారు. సింధు ప్రావిన్‌‌సలోని థార్ జిల్లాలో ఉన్న మారుమూల ధనగామ్ గ్రామానికి చెందిన కోల్హీ (39).. ఆ ప్రావిన్‌‌సలోని రిజర్వ్ స్థానానికి బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) తరఫున పోటీ చేసి సెనెటర్‌గా గెలుపొందారు. 
మూడేళ్లు జైల్లో..
1979లో ఓ పేద రైతు కుటుంబంలో జన్మించిన కోల్హీ.. మూడేళ్లపాటు తన కుటుంబం, బంధువులతో కలసి ఓ ప్రైవేట్ జైలులో బానిసగా జీవించారు. ఆ ఘటన జరిగినప్పుడు తాను చిన్న పిల్లనని.. మైనార్టీ మహిళలు, చిన్నారుల కోసం పోరాటం సాగించాలని అప్పుడే నిర్ణయించుకున్నాని కృష్ణకుమారి చెప్పారు.


ఫోర్బ్స్ అత్యంత సంపన్నుల జాబితా 2018
2018లో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ నిలిచాడని ఫోర్బ్స్ మ్యాగజైన్ మార్చి 6న వెల్లడించింది. జెఫ్ బెజోస్ ఫోర్బ్స్ శ్రీమంతుల వార్షిక జాబితాలో మొదటి స్థానాన్ని సాధించడం ఇదే మొదటిసారి. గత 24 ఏళ్లలో 18 ఏళ్ల పాటు అత్యంత సంపన్నుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్ బిల్‌గేట్స్ ఈ ఏడాది రెండో స్థానంలో ఉన్నారని పేర్కొంది. ఏడాది కాలంలో అమెజాన్ షేర్లు 59 శాతం పెరగడంతో జెఫ్ బెజోస్ సంపద ఈ ఏడాది దాదాపు రెట్టింపై 11,200 కోట్ల డాలర్లకు పెరిగింది. ఇక రెండో స్థానంలో ఉన్న బిల్‌గేట్స్ సంపద 9,000 కోట్ల డాలర్లుగా ఉంది. ఇక మూడో స్థానంలో 8,400 కోట్ల డాలర్లతో లెజండరీ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ నిలిచారు. 7,200 కోట్ల డాలర్లతో ఫ్రెంచ్ పారిశ్రామికవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ నాలుగో స్థానంలో, 7,100 కోట్ల డాలర్లతో ఫేస్‌బుక్ మార్క్ జుకర్‌బర్గ్ ఐదో స్థానంలో ఉన్నారు. 
119 మంది సంపన్న భారతీయులు... 
భారత్ విషయానికొస్తే, ప్రపంచ బిలియనీర్ల జాబితాలో మొత్తం 119 మంది భారతీయులకు చోటు దక్కింది. వీరిలో 18 మంది కొత్తగా ఈ జాబితాకెక్కారు.అత్యంత సంపన్న భారతీయుడైన రిలయన్‌‌స అధినేత ముకేశ్ అంబానీ ఈ ప్రపంచ సంపన్నుల జాబితాలో 19 వస్థానంలో ఉన్నారు. ఆయన సంపద 4,010 కోట్ల డాలర్లుగా (దాదాపు రూ.2.61 లక్షల కోట్లు) ఉంది.


మేఘాలయ సీఎంగా సంగ్మా ప్రమాణం
మేఘాలయ 12వ ముఖ్యమంత్రిగా నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) చీఫ్ కాన్రాడ్ సంగ్మా బాధ్యతలు స్వీకరించారు. రాజ్‌భవన్‌లో మార్చి 6న సంగ్మాతోపాటు మరో 11 మంది చేత మంత్రులుగా గవర్నర్ గంగా ప్రసాద్ ప్రమాణం చేయించారు. మేఘాలయలో కాంగ్రెస్ 21 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచినా.. రెండే సీట్లు గెలిచిన బీజేపీ ఇతరుల మద్దతు కూడగట్టి ఎన్‌పీపీ అధికారంలోకి వచ్చేలా చక్రం తిప్పింది. 


ఐటీబీపీలో మొదటి కంబాట్ ఆఫీసర్‌గా ప్రకృతి 
ఐటీబీపీ చరిత్రలోనే తొలిసారిగా నేరుగా కంబాట్ అధికారిణిగా ప్రకృతి ఎంపికయ్యారు. బిహార్‌లోని సమస్తీపూర్ జిల్లా ఈమె స్వస్థలం. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్(సీఏపీఎఫ్) కోసం 2016లో యూపీఎస్సీ నిర్వహించిన పరీక్షలో పాతికేళ్ల ప్రకృతి మాత్రమే కంబాట్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. పరీక్ష రాసిన తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి తన కల నిజం చేసుకున్నారు. 
ప్రకృతి బీటెక్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశారు. ప్రస్తుతం పితోర్‌గఢ్‌లోని ఐటీబీపీ యూనిట్‌లో సేవలందిస్తున్నారు. ఐటీబీపీలో మహిళలున్నప్పటికీ వారంతా కానిస్టేబుల్ హోదావాళ్లే. 


పోప్ పాల్ VIకు సెయింట్ గౌరవం 
1960ల్లో క్యాథలిక్ చర్చిలో రెండవ వాటికన్ మండలి ద్వారా సమూల మార్పులు తీసుకొచ్చిన పోప్ ఆరవ పాల్‌ను సెయింట్‌గా గుర్తించి గౌరవించనున్నట్లు వాటికన్ మార్చి 7న ప్రకటించింది. శాన్ సాల్వడార్‌లో క్రైస్తవ ప్రధాన మతగురువుగా పనిచేస్తూ 1980ల్లో సామాజిక న్యాయం, ప్రజల అణచివేతలపై ప్రశ్నించి హత్యకు గురైన ఆస్కార్ రొమెరోకు కూడా సెయింట్‌హుడ్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై పోప్ ఫ్రాన్సిస్ మార్చి 6న సంతకం చేశారు. 

ఫోర్బ్స్ అండర్-40 బిలియనీర్లలో విజయ్‌శేఖర్
ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో మొత్తం 2,208 మంది ఉండగా... అందులో 40 ఏళ్ల లోపువారు కేవలం 63 మంది మాత్రమే. ఈ మేరకు ఫోర్బ్స్ అండర్ -40 బిలియనీర్ల జాబితాను మార్చి 7న ప్రకటించింది. పేటీఎం వ్యవస్థాపకులు విజయ్‌శేఖర్ శర్మ భారత్ తరఫున ఫోర్బ్స్ అండర్-40 బలియనీర్స్ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. 39 ఏళ్ల వయసున్న శర్మ ఇప్పుడు భారత్‌లో అత్యంత పిన్న వయసు కలిగిన బిలియనీర్ అని ఫోర్బ్స్ వెల్లడించింది. ఆయన సంపద 170 కోట్ల డాలర్లుగా ఉంటుందని అంచనా వేసింది. 2011లో పేటీఎం మొబైల్ వ్యాలెట్‌ను శేఖర్ శర్మ ప్రారంభించారు. 

No comments:

Post a Comment