Thursday, 28 June 2018

మే 2018 వ్యక్తులు

ఆసారాం బాపుకు జీవిత ఖైదు పదహారేళ్ల బాలికపై అత్యాచారం కేసులో స్వామీజీ ఆసారాం బాపు (77)కు జోధ్‌పూర్ ప్రత్యేక ఎస్సీ, ఎస్టీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2013లో ఓ మైనర్ బాలిక తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేయడంతో ఆసారాం జోధ్‌పూర్ జైల్లో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నాడు. 
ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న సింధ్ ప్రావిన్సులోని బెరానీ గ్రామంలో 1941, ఏప్రిల్ 17న జన్మించిన ఆసారాం అసలు పేరు అసుమల్ తౌమల్ హర్‌పలాని. 1947లో దేశ విభజన తర్వాత ఆసారాం కుటుంబం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు వలసవచ్చింది. నాలుగో తరగతి వరకు చదువుకున్న ఆసారాం గుజరాత్‌లోని మొతెరాలో సబర్మతి నదీతీరాన ‘మోక్ష కుటీర్’ పేరుతో చిన్న ఆశ్రమాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆసారంకు 400 ఆశ్రమాలు, రెండు కోట్ల మంది అనుచరులు రూ.10,000 కోట్ల సంపద ఉంది.


మై జర్నీ ఫ్రమ్ మార్క్సిజం టు సోషలిజం పుస్తకావిష్కరణ ప్రపంచ వ్యాప్తంగా సమకాలీన మార్పులను గుర్తించి అందుకనుగుణంగా ప్రజలు కూడా మారాల్సిన అవసరం ఉందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఏప్రిల్ 26న ఆర్థికవేత్త ప్రొ.సీహెచ్ హనుమంతరావు రాసిన ‘మై జర్నీ ఫ్రమ్ మార్క్సిజం-లెనినిజం టు నెహ్రూవియన్ సోషలిజం: సమ్ మెమోరీస్, రిఫ్లెక్షన్స్ ఆన్ ఇంక్లూజివ్ గ్రోత్’ పుస్తకావిష్కరణ సభలో ఈ మేరకు వ్యాఖ్యానించారు.

ఇందూ మల్హోత్రా నియామకానికి కేంద్రం ఆమోదం 
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సీనియర్ న్యాయవాది ఇందూ మల్హోత్రా నియామకానికి కేంద్రం ఏప్రిల్ 26న ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టుకు ఒక మహిళా న్యాయవాది నేరుగా ఎంపికవడం ఇదే మొదటిసారి. 1989లో జస్టిస్ ఫాతిమా బీవీ సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం జస్టిస్ ఆర్.భానుమతి మాత్రమే సుప్రీంలో మహిళా న్యాయమూర్తిగా ఉన్నారు. 
అదే విధంగా ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్(59)ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలన్న కొలీజియం సిఫార్సుల్ని కేంద్రం తిప్పిపంపుతూ వాటిని పునఃపరిశీలించాలని కోరింది.
 

కిలిమంజారోని అధిరోహించిన ఏడేళ్ల బాలుడు 
ఆఫ్రికాలోని కిలిమంజారో (5,380 మీటర్లు) పర్వతాన్ని ఏడేళ్ల సమన్యు యాదవ్ ఏప్రిల్ 2న అధిరోహించాడు. దీంతో ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కుడిగా గిన్నిస్‌బుక్ రికార్డు నెలకొల్పాడు. అమెరికాకు చెందిన క్యాష్ అనే బాలుడి పేరిట ఉన్న ఈ రికార్డును మూడో తరగతి చదువుతున్న సమన్యు అధిగమించాడు. కర్నూలుకి చెందిన సమన్యు ఇప్పటికే మౌంట్ ఎవరెస్ట్‌ను కూడా అధిరోహించాడు.


సీపీఐ ప్రధాన కార్యదర్శిగా సుధాకర్ రెడ్డి 
సీపీఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సురవరం సుధాకర్ రెడ్డి వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. కేరళలోని కొల్లాంలో ఏపిల్ 29న పార్టీ 23వ ప్లీనరీ సమావేశాల్లో ప్రధాన కార్యదర్శితో పాటు 126 మంది సభ్యుల జాతీయ మండలి, 11 మందితో కూడిన సెక్రటేరియట్, 11 మంది సభ్యులు గల కంట్రోల్ మిషన్‌ను ఎన్నుకున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం మాజీ నాయకుడు కన్హయ్య కుమార్‌కు జాతీయ మండలిలో చోటు దక్కింది. తెలంగాణలోని నల్గొండ నియోజక వర్గం నుంచి రెండు సార్లు (1998-99, 2004-09) లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన సుధాకర్ రెడ్డి 2012లో తొలిసారి సీపీఐ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 


మత్స్యకార సంఘం అధ్యక్షుడు బాబూరావు కన్నుమూత 
మత్స్యకార సంఘం జాతీయ అధ్యక్షుడు రేవు బాబూరావు(77) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఏప్రిల్ 28న విశాఖపట్నంలో తుది శ్వాస విడిచారు. బాబూరావు కనకమహాలక్ష్మి కో-ఆపరేటివ్ బ్యాంక్ డెరైక్టర్‌గా కూడా ఉన్నారు. ఆయన భార్య రేవు రత్నకూమారి గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు.

సుదీర్ఘ కాలం కొనసాగిన సీఎంగా చామ్లింగ్ 
సుదీర్ఘ కాలం కొనసాగిన సీఎంగా సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ ఏప్రిల్ 28న రికార్డు సృష్టించారు. 1994 డిసెంబర్ 12న తొలిసారి సిక్కిం ముఖ్యమంత్రిగా చామ్లింగ్ ఎన్నికయ్యారు. సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్(ఎస్‌డీఎఫ్)ని వరుసగా ఐదుస్లారు(1994, 1999, 2004, 2009, 2014) అధికారంలోకి తీసుకొచ్చారు. ఇంతకు ముందు ఈ ఘనత పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు పేరిట ఉంది. బసు 1977 జూన్ 21 నుంచి 2000 నవంబర్ 6 వరకు( 23 ఏళ్లకు పైనే- 8,540 రోజులు) ఐదుసార్లు పశ్చిమబెంగాల్ సీఎంగా పనిచేశారు.


ఐఆర్‌డీఏ చైర్మన్‌గా సుభాష్ చంద్ర 
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ, డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డీఏ) చైర్మన్‌గా మాజీ ఐఏఎస్ అధికారి సుభాష్ చంద్ర కుంతియా నియమితులయ్యారు. ఈ మేరకు క్యాబినెట్ నియామకాల కమిటీ(ఏసీసీ) మే 1న ఉత్తర్వులు జారీ చేసింది. 1981 బ్యాచ్‌కు చెందిన కర్ణాటక కేడర్ అధికారి సుభాష్ చంద్ర గతంలో కర్ణాటక ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. ఐఆర్‌డీఏ చైర్మన్‌గా ఐదేళ్ల పాటు బాధ్యతలు నిర్వహించిన టి.ఎస్.విజయన్ ఫిబ్రవరిలో పదవీ విరమణ చేశారు. 


పీఏసీ చైర్మన్‌గా మల్లిఖార్జున ఖర్గే 
పార్లమెంట్ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) అధ్యక్షునిగా లోక్‌సభ కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే రెండోసారి నియమితులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మే 2న ప్రకటించారు. 22 మంది సభ్యులు గల ఈ కమిటీ ప్రభుత్వ ఖర్చులు పార్లమెంట్ కేటాయింపులకు అనుగుణంగా ఉన్నాయో లేదో పరిశీలిస్తుంది. అంచనాల కమిటీకి బీజేపీ నేత మురళీ మనోహర్ జోషీని, పబ్లిక్ అండర్‌టేకింగ్‌‌స కమిటీకి శాంతకుమార్‌ను చైర్మన్‌గా నియమించారు. ఈ కమిటీటు ఏడాదిపాటు కొనసాగుతాయి.


ఆర్థిక వేత్త అశోక్ మిత్రా కన్నుమూత ప్రముఖ ఆర్థిక వేత్త అశోక్ మిత్రా (90) అనారోగ్యంతో మే 2న కన్నుమూశారు. మిత్రా ఇందిరా గాంధీ ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేశారు. జ్యోతిబసు పశ్చిమబెంగాల్ సీఎంగా ఉన్నప్పుడు పదేళ్లు ఆర్థికమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. సాహిత్య రంగానికి చేసిన కృషికిగాను మిత్రాకి సాహిత్య అకాడమి పురస్కారం దక్కింది.



ఏప్రిల్ 2018 వ్యక్తులు

ఎఫ్‌ఎల్‌వో నేషనల్ ప్రెసిడెంట్‌గా పింకీ రెడ్డి 
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) మహిళా ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఎల్‌వో)కు నేషనల్ ప్రెసిడెంట్‌గా పారిశ్రామికవేత్త పింకీ రెడ్డి ఎంపికయ్యారు. ఎఫ్‌ఎల్‌వో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా హర్జిందర్ కౌర్ తల్వార్, వైస్ ప్రెసిడెంట్‌గా జాహ్నవిలు నియమితులయ్యారు. హైదరాబాద్‌కి చెందిన పింకీ రెడ్డి ప్రస్తుతం ఎఫ్‌ఎల్‌వో హైదరాబాద్ చాప్టర్‌కు చైర్‌పర్సన్‌గా ఉన్నారు.


కామన్వెల్త్ చీఫ్‌గా ప్రిన్స్ చార్లెస్
కామన్వెల్త్ చీఫ్‌గా ప్రిన్స్ చార్లెస్ నియామకానికి 53 దేశాధినేతలు ఆమోదముద్ర వేశారు. కామన్వెల్త్ దేశాధినేతల (చోగమ్) సదస్సులో భాగంగా ఏప్రిల్ 20న విండ్‌సర్ కోటలో రహస్యంగా జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో చార్లెస్ తన తల్లి క్వీన్ ఎలిజబెత్ నుంచి కామన్వెల్త్ బాధ్యతల్ని అధికారికంగా చేపట్టనున్నారు. 


జస్టిస్ రాజిందర్ సచార్ కన్నుమూత
ప్రముఖ హక్కుల కార్యకర్త, ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రాజిందర్ సచార్ (94) ఏప్రిల్ 20న కన్నుమూశారు. సచార్ 1985లో ఆగస్టు 6 నుంచి డిసెంబర్ 22 వరకు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ముస్లింల సామాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితులపై యూపీఏ ఏర్పాటు చేసిన సచార్ కమిటీ కి అధిపతిగా వ్యవహరించారు. ఈ కమిటీ 2006 నవంబర్‌లో ముస్లింల స్థితిగతులపై పార్లమెంటుకు నివేదికను సమర్పించింది. 


ప్రముఖ పాత్రికేయుడు షెణాయ్ మృతి
ప్రముఖ పాత్రికేయుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత టి.వి.ఆర్.షెణాయ్ (77) ఏప్రిల్ 17న బెంగళూరులో మరణించారు. ఆయన వీక్ పత్రికకు సంపాదకుడిగా, ప్రసార భారతి కార్యనిర్వాహక సభ్యుడిగా వ్యవహరించారు. 2003లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు.

క్యూబా అధ్యక్షుడిగా డియాజ్ కానెల్
క్యూబా నూతన అధ్యక్షుడిగా కమ్యూనిస్ట్ నాయకుడు మిగ్వెల్ డియాజ్ కానెల్ ఏప్రిల్ 18న ఎన్నికయ్యారు. 2013 నుంచి క్యూబాకు తొలి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న కానెల్ ప్రస్తుత అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో స్థానంలో బాధ్యతలు చేపడతారు. క్యాస్ట్రో కుటుంబేతర వ్యక్తి ఈ పదవికి ఎన్నికవడం ఆరు దశాబ్దాల కాలంలో ఇదే తొలిసారి. 


శ్వేత దేవత సిస్టర్ ఆగ్నెస్ మృతి
కెనడా సైనికులు శ్వేత దేవతగా పిలుచుకునే సిస్టర్ ఆగ్నెస్-మేరీ వలోయిస్(103) ఏప్రిల్ 20న మరణించారు. ఆమె రెండో ప్రపంచ యుద్ద సమయంలో విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్న సంకీర్ణ దళాలకు చెందిన కెనడా సైనికులకు విశేష సేవలందించారు.

బ్యాంక్స్ బోర్డ్ చైర్మన్‌గా భాను ప్రతాప్ శర్మ బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో (బీబీబీ) చైర్మన్‌గా పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం (డీవోపీటీ) మాజీ కార్యదర్శి భాను ప్రతాప్ శర్మను కేంద్రం నియమించింది. ఆయన రెండేళ్ల పాటు పదవిలో ఉంటారు. శర్మ ప్రస్తుతం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో)లో రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్ చైర్మన్‌గా ఉన్నారు. బీబీబీ తొలి చైర్మన్ వినోద్ రాయ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు.


వీహెచ్‌పీ అధ్యక్షుడిగా వీఎస్ కోక్జె
విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అంతర్జాతీయ అధ్యక్షుడిగా హిమాచల్‌ప్రదేశ్ మాజీ గవర్నర్ వీఎస్ కోక్జె ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికి ఏప్రిల్ 10న జరిగిన ఎన్నికల్లో ఆయనకు 131 ఓట్లు రాగా, ప్రస్తుత అధ్యక్షుడు రాఘవరెడ్డికి 60 ఓట్లు దక్కాయి. దీంతో మూడు దశాబ్దాలుగా విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ)లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ప్రవీణ్ తొగాడియా ఆ సంస్థ నుంచి పూర్తిగా వైదొలిగారు. అధ్యక్ష ఎన్నికలకు ఆయన నామినేట్ చేసిన రాఘవరెడ్డి ఓడిపోవడమే ఇందుకు కారణమని తెలిపారు. తొగాడియా 2011 నుంచి వీహెచ్‌పీకి ఇంటర్నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు.


ఎడిటర్స్ గిల్డ్ అధ్యక్షుడిగా శేఖర్‌గుప్తా
ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా జర్నలిస్ట్ శేఖర్‌గుప్తా ఎన్నికయ్యారు. శేఖర్‌గుప్తా ప్రస్తుతం బిజినెస్ స్టాండర్డ్‌లో ‘నేషనల్ ఇంట్రెస్ట్’ కాలమిస్ట్‌గా, ‘దిప్రింట్’ న్యూస్ పోర్టల్‌కు ఎడిటర్-ఇన్-చీఫ్‌గా పని చేస్తున్నారు. గిల్డ్ ప్రధాన కార్యదర్శిగా బిజినెస్ స్టాండర్డ్ పత్రిక ఎడిటోరియల్ డెరైక్టర్ ఏకే భట్టాచార్య, కోశాధికారిగా న్యూస్‌ఎక్స్ ఎడిటర్ (న్యూస్ ఎఫైర్స్) షీలా భట్ ఎన్నికయ్యారు.

ప్రపంచ వృద్ధుడుగా నొనకా
జపాన్‌కు చెందిన 112 ఏళ్ల మసాజో నొనకా ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయస్కుడిగా గుర్తింపు పొందారు. ఈ మేరకు ఆయనకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఏప్రిల్ 10న ధ్రువీకరణ పత్రం అందించింది.

మలబార్ గోల్డ్ అంబాసిడర్‌గా మానుషి చిల్లర్ 
ప్రముఖ జువెలరీ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్‌‌స మిస్ వరల్డ్ మానుషి చిల్లర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఈ మేరకు ఏప్రిల్ 5 న ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహమ్మద్ చేతుల మీదుగా మానుషి బ్రాండ్ అంబాసిడర్ ఒప్పంద పత్రాలను స్వీకరించారు.


కృష్ణజింకల కేసులో సల్మాన్‌కు ఐదేళ్ల జైలుశిక్ష
కృష్ణ జింకల్ని వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్(52)కు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. 1998 నాటి కేసులో జోధ్‌పూర్ ట్రయల్ కోర్టు అతనిని దోషిగా నిర్ధారిస్తూ ఐదేళ్ల శిక్ష విధించింది. ‘వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని 9/51 సెక్షన్ కింద సల్మాన్‌ను దోషిగా తేలుస్తూ ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తున్నా’ అని చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ దేవ్ కుమార్ ఖత్రి తీర్పు వెలువరించారు. ఈ సెక్షన్ కింద గరిష్టంగా ఆరేళ్ల జైలుశిక్ష విధించవచ్చు.
ఈ కేసులో నిందితులుగా ఉన్న సహ నటులు సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సొనాలీ బెంద్రెలతో పాటు స్థానిక వ్యక్తి దుష్యంత్ సింగ్‌ను ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ కింద కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. 
కేసు నేపథ్యం
1998, అక్టోబర్ 2: కృష్ణ జింకలను వేటాడినందుకు సల్మాన్‌తో పాటు సైఫ్ అలీఖాన్, సోనాలీ బెంద్రె, టబు, నీలంపై రాజస్తాన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు. 
2006, ఏప్రిల్ 10: సల్మాన్‌ను దోషిగా ప్రకటించి అయిదేళ్లు జైలు శిక్ష, 25 వేల జరిమానా విధించిన ట్రయల్ కోర్టు. 
2006, ఆగస్టు 31: ట్రయల్ కోర్టు తీర్పుపై రాజస్తాన్ హైకోర్టు స్టే.
2016, జులై 25: సల్మాన్‌ను నిర్దోషిగా విడుదల చేసిన హైకోర్టు. 
2016, నవంబర్ 11: హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన రాజస్తాన్ ప్రభుత్వం.. కేసును మళ్లీ విచారించాలని జోధ్‌పూర్ ట్రయల్ కోర్టును ఆదేశించిన సుప్రీం కోర్టు.
సల్మాన్‌పై ఉన్న ఇతర కేసులుకృష్ణ జింకల కేసు (1998) 
హమ్ సాథ్ సాథ్ హై షూటింగ్ సమయంలో రాజస్తాన్‌లోని కంకణి గ్రామంలో రెండు కృష్ణ జింకల్ని సల్మాన్ కాల్చి చంపారని కేసు నమోదైంది. 20 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం సల్మాన్‌ను జోధ్‌పూర్ ట్రయల్ కోర్టు దోషిగా నిర్ధారించి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. 
అక్రమ ఆయుధాల కేసు (1998) 
కృష్ణ జింకల్ని చంపే సమయంలో సల్మాన్ వద్ద అక్రమ ఆయుధాలు ఉన్నాయంటూ కేసు నమోదైంది. కృష్ణ జింకల్ని వేటాడడానికి అమెరికాలో తయారైన .22 రైఫిల్, .32 రైఫిల్ వాడారని అభియోగాలు నమోదయ్యాయి. 2017, జనవరి 18న కోర్టు ఈ కేసును కొట్టేసింది.
చింకారా కేసు (1998) 
హమ్ సాథ్ సాథ్ హై షూటింగ్ సమయంలోనే సల్మాన్ మూడు చింకారా (లేళ్లు)లను వేటాడారని మరో కేసు నమోదైంది. సల్మాన్ ఖాన్ భావాడ్ గ్రామంలో రెండు లేళ్లు, మాంథానియా గ్రామంలో మరో లేడిని వేటాడారని వేర్వేరుగా రెండు కేసులు నమోదయ్యాయి. 2006లో ట్రయల్ కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించినా, 2017లో రాజస్థాన్ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 
హిట్ అండ్ రన్ కేసు (2002) 
ముంబైలోని బాంద్రా వీధుల్లో ఫుట్‌పాత్‌పైకి కారు నడిపి ఒకరి మృతికి కారణమయ్యాడని సల్మాన్‌పై కేసు నమోదైంది. ఈ కేసులో ట్రయల్ కోర్టు సల్మాన్‌ను దోషిగా నిర్ధారించినా.. 2015లో ముంబై హైకోర్టు సల్మాన్‌ను నిర్దోషిగా తేల్చింది.
జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో సల్మాన్ శిక్ష అనుభవించడం ఇది నాలుగోసారి.. వన్యప్రాణుల్ని వేటాడిన కేసుల్లో గతంలో 1998, 2006, 2007ల్లో మొత్తం 18 రోజులు జోధ్‌పూర్ జైల్లో గడిపారు.


నాస్కామ్ చైర్మన్ గా రిషద్ ప్రేమ్‌జీ
నేషనల్ ఆసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్(నాస్కామ్) చైర్మన్‌గా విప్రోకు చెందిన రిషద్ ప్రేమ్‌జీ ఏప్రిల్ 10న నియమితులయ్యారు. ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్న రామన్ రాయ్ స్థానంలో రిషద్ బాధ్యతలుస్వీకరిస్తారు. నాస్కామ్ వైస్ చైర్మన్‌గా కేశవ్ మురుగేశ్ నియమితులయ్యారు.


మేడమ్ టుస్సాడ్స్ లో కోహ్లి బొమ్మభారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి మైనపు బొమ్మను న్యూఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్‌‌స మ్యూజియంలో ప్రతిష్టించనున్నట్లు మ్యూజియం నిర్వాహకులు మార్చి 28న ప్రకటించారు. ఈ మ్యూజియంలో కపిల్‌దేవ్, సచిన్ టెండూల్కర్, అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ విగ్రహాలు ఉన్నాయి. విరాట్ కోహ్లి ఇప్పటికే ఐసీసీ నుంచి ‘వరల్డ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’, బీసీసీఐ నుంచి ‘ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి అర్జున అవార్డు, పద్మశ్రీ పురస్కారాలు సొంతం చేసుకున్నాడు.


ఫోర్బ్స్ జాబితాలో హెచ్‌సీయూ విద్యార్థి
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధక విద్యార్థి రాహుల్ గాయమ్‌కి ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కింది. ఏసియా పరిధిలో ఉన్న 300 మంది యంగ్ ఇన్నోవేటర్లలో రాహుల్ తొలి 30 మందిలో ఒకరిగా నిలిచారు. ఈ మేరకు ఫోర్బ్స్ ‘30 అండర్-30 ఏసియా 2018’ జాబితాను విడుదల చేసింది.
రాహుల్ హెచ్‌సీయూలో ఫిజిక్స్‌లో ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ కోర్సును పూర్తి చేశారు. 2013లో హెచ్‌సీయూలో పీహెచ్‌డీ కోర్సులో చేరారు. గాయమ్ సోదరులు రాహుల్ గాయమ్, రాజా గాయమ్‌లు కలసి 2010లో టీ-హబ్‌లో ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్‌ను (గాయమ్ మోటార్స్) రూపొందించారు. దీని ద్వారానే ప్రపంచంలోనే బ్యాటరీతో నడిచే తొలి ఆటోరిక్షా లీ-అయాన్ ను రూపొందించారు.


నాస్కామ్ ప్రెసిడెంట్‌గా దేవయాని ఘోష్
భారత ఐటీ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్ ప్రెసిడెంట్‌గా దేవయాని ఘోష్ నియమితులయ్యారు. ఈమె ఇంతకుముందు ఇంటెల్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం అధ్యక్షుడు ఆర్.చంద్రశేఖర్ స్థానంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు.


పద్మభూషణ్ అందుకున్న ధోని
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ‘పద్మభూషణ్’ అవార్డు అందుకున్నాడు. మూడో అత్యున్నత పౌర పురస్కారమైన ఈ అవార్డును రాష్ట్రపతి భవన్‌లో ఏప్రిల్ 2న జరిగిన వేడుకలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రదానం చేశాడు. 2007లో టి20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్ సారథిగా వ్యవహరించిన ధోనిని భారత ఆర్మీ 2011, నవంబర్ 1న లెఫ్టినెంట్ కల్నల్ హోదాతో సత్కరించింది. 


ఎలక్షన్ కమిషన్ అంబాసిడర్‌గా ద్రవిడ్
ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చేందుకు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌ను ఎలక్షన్ కమిషన్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ ఓంప్రకాశ్ రావత్ మార్చి 27న న్యూఢిల్లీలో ప్రకటించారు. ద్రవిడ్ ఇప్పటికే ధూమపాన నిషేధం, ఆరోగ్య జాగృతి వంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

పీఎం సహాయనిధికి సచిన్‌వేతనం
క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రాజ్యసభ సభ్యుడిగా అందుకున్న వేతనం, ఇతర భత్యాలను ప్రధానమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చారు. సచిన్ ఆరేళ్లలో వేతనభత్యాల కింద దాదాపు రూ.90 లక్షలు అందుకున్నారు.

ఎన్‌టీఏ డెరైక్టర్ జనరల్‌గా జోషి
జాతీయ పరీక్షా సంస్థ(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) డెరైక్టర్ జనరల్‌గా వినీత్ జోషి మార్చి 30న నియమితులయ్యారు. 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారైన వినీత్ ఐదేళ్లపాటు పదవిలో కొనసాగుతారు.

పౌరహక్కుల ఉద్యమకారిణి లిండా మృతి
పౌరహక్కుల ఉద్యమకారిణి లిండా బ్రౌన్(76) అమెరికాలోని కెన్సాస్‌లో మార్చి 25న మరణించారు. ఆమె 1954లో అమెరికా ప్రభుత్వ పాఠశాలల్లో జాతి వివక్షపై న్యాయపోరాటం చేసి అనూహ్య విజయం సాధించారు.



మార్చి 2018 వ్యక్తులు

వొడాఫోన్-ఐడియా విలీన సంస్థకు చైర్మన్‌గా కేఎం బిర్లాత్వరలో విలీనం కాబోయే వొడాఫోన్-ఐడియా సంస్థకు నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కుమార్ మంగళం బిర్లా బాధ్యతలు చేపడతారు. ఈ మేరకు ఐడియా ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌ను దాఖలు చేసింది. దీనిప్రకారం, బైలేశ్ శర్మ కొత్త సంస్థ సీఈఓగా ఉంటారు. శర్మ ప్రస్తుతం వొడాఫోన్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ రెండు సంస్థల విలీనంతో దేశంలో దాదాపు 23 బిలియన్ డాలర్ల విలువైన అతిపెద్ద టెలికం సంస్థ ఆవిర్భావం జరగనుంది. దీని మార్కెట్ వాటా దాదాపు 35 శాతం ఉంటుంది. 


ఇటలీ సంస్థకు డెరైక్టర్‌గా తెలుగు వైద్యుడు వికాస్‌గౌడ్
హైదరాబాద్‌కు చెందిన దంత వైద్య నిపుణులు డా. వికాస్‌గౌడ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఇటలీలోని 'యూనివర్సిటీ డెగ్లి స్టడీ ది జెనోవా' తొలిసారిగా తమ సంస్థకు డెరైక్టర్‌గా నియమించింది. భారతీయ వైద్యుడిని డెరైక్టర్‌గా నియమించడం ఇదే తొలిసారి. దంతవైద్యంలో ఇంప్లాంటాలజీలో అనుభవం గడించిన ఈయనను విద్యాబోధనకు గాను అక్కడ డెరైక్టర్ హోదా కల్పించినట్టు యూనివర్సిటీ తెలిపింది. 

దుమ్‌కా ఖజానా కేసులో లాలూకి 14 ఏళ్ల జైలు శిక్ష
1990ల్లో దుమ్‌కా ఖజానా నుంచి అక్రమంగా రూ.3.13 కోట్లు తీసుకున్న కేసులో బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు.. రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతోపాటుగా రూ.60 లక్షల జరిమానా విధించింది. ఐపీసీతో పాటుగా అవినీతి నిరోధక చట్టం కింద 2 వేర్వేరు కేసుల్లో ఏడేళ్ల చొప్పున జైలు శిక్షను సీబీఐ జడ్జి శివ్‌పాల్ మార్చి 24న ప్రకటించారు. ఈ రెండు శిక్షలు ఒకదాని తర్వాత మరొకటి అమలు చేయాలని ఆదేశించారు. 

ఆయుష్మాన్ భారత్ సీఈవోగా ఇందు భూషణ్
కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జాతీయ ఆరోగ్య భద్రతా పథకం 'ఆయుష్మాన్ భారత్'కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఇందు భూషణ్ నియమితులయ్యారు. ఆయన రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. అమెరికాలో హెల్త్ సెన్సైస్‌లో మాస్టర్స్, ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీ చేసిన భూషణ్ ప్రస్తుతం ఫిలిప్పీన్స్లోని మనీలా కేంద్రంగా పనిచేస్తున్న ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ) తూర్పు ఆసియా విభాగం డెరైక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
దేశంలోని ప్రతి పేద కుటుంబానికి ఏటా రూ.5 లక్షల మేర ఉచిత బీమా సౌకర్యం కల్పించడానికి ఉద్దేశించినదే 'ఆయుష్మాన్ భారత్' పథకం.


ఫోర్బ్స్ ఆసియా అండర్ 30 లో అనుష్క, పీవీ సింధు
ఫోర్బ్స్ మార్చి 27న విడుదల చేసిన '30 అండర్ 30 ఆసియా-2018' జాబితాలో బాలీవుడ్ నటి అనుష్క శర్మ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు చోటు సంపాదించారు. 30 ఏళ్ల లోపు వయసున్న నటీమణుల్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటిగా అనుష్క.. అతి తక్కువ కాలంలో అత్యధిక విజయాలు నమోదు చేసిన క్రీడాకారిణిగా పీవీ సింధులను ఫోర్బ్స్ అభివర్ణించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ జాబితాలో 300 మందికి స్థానం దక్కింది. భారత్ నుంచి మోడల్ భూమికా అరోరా, సైనప్ సీఈఓ అశ్విన్ రమేష్, అథ్లెట్ శ్రుతి మంథన, హేడేకేర్ ఫౌండర్ దీపాంజలి దాల్మియా, హెల్త్‌సెట్‌గో ఫౌండర్ ప్రియా ప్రకాష్ వంటి యువ వాణిజ్యవేత్తలు, టెక్నోక్రాట్లకు కూడా చోటు దక్కింది. 

మయన్మార్ అధ్యక్షుడు రాజీనామా
మయన్మార్ అధ్యక్ష పదవి నుంచి హితిన్ క్యా వైదొలిగారు. బాధ్యతలు, విధులు నుంచి విశ్రాంతి తీసుకునేందుకే ఆయన పదవికి రాజీనామా చేశారని ఆ దేశ అధ్యక్ష కార్యాలయ వర్గాలు మార్చి 20న వెల్లడించాయి. మయన్మార్ రాజ్యాంగం ప్రకారం..అధ్యక్షుడు రాజీనామా చేస్తే ఉపాధ్యక్షుడు ఆ బాధ్యతలను చేపడతారు. పార్లమెంటు ఏడు రోజుల్లోగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. 

ఏఐఈపీఎఫ్‌ఎస్‌ఎఫ్ చీఫ్ ప్యాట్రన్‌గా వినోద్ కుమార్
ఆల్ ఇండియా ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ స్టాఫ్ ఫెడరేషన్ (ఏఐఈపీఎఫ్‌ఎస్‌ఎఫ్) చీఫ్ ప్యాట్రన్‌గా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఎంపీ వినోద్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. న్యూఢిల్లీలో మార్చి 21న 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి హాజరైన ఈపీఎఫ్ ఉద్యోగులు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

అప్పీ ఫిజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా సల్మాన్ ఖాన్ బేవరేజ్ దిగ్గజం పార్లే ఆగ్రో తాజాగా బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా సల్మాన్ ఖాన్.. పార్లే ఆగ్రోకు చెందిన అప్పీ ఫిజ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారు. దేశవ్యాప్తంగా మరింత మంది వినియోగదారులకు అప్పీ ఫిజ్‌ను చేరువ చేయాలనే లక్ష్యంతోనే సల్మాన్ ఖాన్‌తో జతకట్టామని పార్లే ఆగ్రో పేర్కొంది. కాగా సల్మాన్ ఖాన్ ఇకముందు అప్పీ ఫిజ్ బ్రాండ్ ప్రచార చిత్రాల్లో కనిపిస్తారు. ఇక పార్లే ఆగ్రోకు ఫ్రూటీ, అప్పీ, ఫ్రూటీ ఫిజ్, అప్పీ ఫిజ్ వంటి పలు బ్రాండ్‌‌స ఉన్నాయి.

చైనా శాశ్వత అధ్యక్షుడిగా జిన్‌పింగ్
చైనా అధ్యక్షుడిగా షి జిన్‌పింగ్ రెండోసారి మళ్లీ ఎన్నికయ్యారు. ఆ దేశ రాజ్యాంగంలో అధ్యక్షుడు రెండు సార్లు మాత్రమే పదవిలో ఉండే నిబంధనను ఎత్తివేస్తూ ఇటీవల చైనా పార్లమెంటు నిర్ణయం తీసుకుంది. దీంతో రెండో పర్యాయం అధ్యక్షుడిగా ఎన్నికై న జిన్‌పింగ్ (64) అయిదేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత కూడా జీవితకాలం అధ్యక్షుడిగా కొనసాగేందుకు అవకాశం లభించింది. చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ) అధినేతగా కూడా జిన్‌పింగ్ ఎంపికయ్యారు. ఇప్పటికే ఆయన అధికార చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. జిన్‌పింగ్ విధేయుడు, సన్నిహితుడు వాంగ్ క్విషాన్ (69) చైనా ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వాంగ్ ఎన్నికపై పలు విమర్శలు వస్తున్నాయి. 68 ఏళ్లు నిండిన వారు పదవీ విరమణ చేయడం సంప్రదాయం.

వివో బ్రాండ్ అంబాసిడర్‌గా అమీర్ ఖాన్
వివో బ్రాండ్ మొబైల్ ఫోన్లకు ప్రముఖ హిందీ సినిమా నటుడు అమీర్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు అమీర్ ఖాన్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని వివో ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ కెన్నీ జెంగ్ తెలిపారు. వివో బ్రాండ్ కింద భవిష్యత్తులో రానున్న మోడళ్లకు అమీర్ ఖాన్ ప్రచారం చేస్తారని, ఆయనతో త్వరలోనే ఒక టీవీ కమర్షియల్‌ను తెస్తామని వివరించారు. 


రష్యా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన పుతిన్
అమెరికా, బ్రిటన్‌లతో తీవ్రమైన విభేదాలు నెలకొన్న నేపథ్యంలో రష్యన్లు మరోసారి వ్లాదిమిర్ పుతిన్(65)కే పట్టం కట్టారు. దేశవ్యాప్తంగా మార్చి 18న ముగిసిన అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌కు 76.67 శాతం ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి కమ్యూనిస్ట్ పార్టీ నేత పావెల్ గ్రుడినిన్‌కు 11.79 శాతం ఓట్లు వచ్చాయి. తాజా విజయంతో 2024 వరకూ పుతిన్ రష్యా అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. అంతేకాకుండా నియంత జోసెఫ్ స్టాలిన్ (24 ఏళ్లు) తర్వాత అత్యధికకాలం రష్యాను పాలించిన నేతగా పుతిన్ రికార్డు సృష్టించారు. 
2014లో ఉక్రెయిన్ నుంచి రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియాలో పుతిన్‌కు 92 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి అలెక్సీ నావెల్నీపై రష్యా ఎన్నికల సంఘం వేటు వేయడంతో పుతిన్ విజయం లాంఛనప్రాయమైంది. 

కేజీబీ టు క్రెమ్లిన్ 
రష్యా నేత పుతిన్ అధ్యక్ష ఎన్నికల్లో సాధించిన ఘన విజయం 2024 వరకూ ఆయన పదవిలో కొనసాగడానికి అవకాశమిచ్చింది. రష్యా రాజ్యాంగం ప్రకారం వరుసగా రెండు సార్లు మించి ఏ నేతా అధ్యక్ష పదవి చేపట్టకూడదు. దాని ప్రకారం 2024 ఎన్నికలు వదిలేసి 2030లో ఆయన అధ్యక్ష పదవికి పోటీచేయొచ్చు. 

వ్యూహ రచనలో దిట్ట! 
నిఘా సంస్థ కేజీబీలో ఓ అధికారి స్థాయి నుంచి రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ సెనెట్ వరకూ సాగిన పుతిన్ ప్రయాణం అసామాన్యం. పుతిన్ అధ్యక్షుడిగా ఉన్న మొదటి ఎనిమిదేళ్లలో (2000-2008) రష్యా ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టింది. ఆ రోజుల్లో భారీగా పెరిగిన ముడి చమురు, సహజ వాయువు ధరల ఫలితంగా సంపన్నులు సహా రష్యన్ల ఆదాయాలు గణనీయంగా పెరిగాయి. దీంతో ఆయన తన అధికారం సుస్థిరం చేసుకోగలిగారు. ప్రభుత్వంపై తిరుగులేని పట్టు సంపాదించారు. మొదట రాజకీయ పలుకుబడి ఉన్న బడా పారిశ్రామికవేత్తలను, తర్వాత ప్రతిపక్ష నేతలను నిరాధార ఆరోపణలతో దెబ్బతీశారు. వారిలో కొందరిని దేశం నుంచి బహిష్కరించారు. రష్యాలో రాజకీయాలు లేని ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుకు పుతిన్ చేసిన ప్రయత్నం ఫలించింది. ‘ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తా. మీరు రాజకీయాలకు దూరంగా ఉండండి’ అన్న పుతిన్ మాటలను సామాన్య ప్రజానీకం, కార్మికవర్గం నమ్మడంతో పుతిన్ అధికారానికి అడ్డంకులు లేకుండా పోయాయి. అయితే, గత ఆరేళ్లలో పాశ్చాత్యదేశాల ఆంక్షల ఫలితంగా రష్యా ఆర్థిక సమస్యలు తీవ్రమయ్యాయి. అయినప్పటికీ సిరియా అంతర్యుద్ధంలో జోక్యం, క్రిమియా ఆక్రమణ ద్వారా దేశాన్ని పుతిన్ అగ్రరాజ్యం దిశగానే నడిపిస్తున్నారని రష్యన్లు విశ్వసిస్తున్నారు. కాగా, పుతిన్‌కు తొలినాళ్లలో ప్రజాదరణ ఉన్నప్పటికీ ఇప్పుడు జరిగే ప్రతీ ఎన్నికల్లోనూ రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని ప్రతిపక్షాలు, పరిశీలకులు ఆరోపిస్తున్నారు. 


అణచివేయడంలో ఘటికుడు
ప్రధాన ప్రత్యర్థులను అణచివేయడం, అక్రమంగా జైలుకు పంపడం, ఎన్నికల్లో పోటీచేయకుండా అనర్హులను చేయడం పుతిన్‌కు కొట్టిన పిండి. 1952లో లెనిన్‌గ్రాడ్‌లో జన్మించిన పుతిన్ సెయింట్ పీటర్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదువుకున్నారు. 1975లో కేజీబీలో ఇంటెలిజెన్‌‌స అధికారిగా ఉద్యోగంలో చేరి వేగంగా లెఫ్టినెంట్ కల్నల్ స్థాయికి ఎదిగారు. రాజకీయాలపై ఆసక్తితో 1991లో ఉద్యోగానికి రాజీనామా చేసి మకాం రాజధాని మాస్కోకు మార్చారు. యునెటైడ్ రష్యా పార్టీ నేత అయిన పుతిన్‌కు ప్రధానిగా తొలి అవకాశం అధ్యక్షుడు బోరిస్ ఎలిత్సిన్ ఇచ్చారు. 1999లో అప్పటి ప్రధాని సెర్జీ స్టెపాషిన్‌ను బర్తరఫ్ చేసి పుతిన్‌ను ప్రధానమంత్రిగా ప్రమోట్ చేశారు. అదే ఏడాది డిసెంబర్‌లో రాజీనామా చేసిన ఎలిత్సిన్ తాత్కాలిక అధ్యక్షునిగా పుతిన్‌ను నియమించారు. 2000 అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ తన సమీప కమ్యూనిస్ట్ ప్రత్యర్థి గెనడీ జ్యుగనోవ్‌పై విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో 72 శాతం ఓట్లు సాధించి రెండోసారి అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. 2008లో ప్రధానిగా నియమితులయ్యారు. 2011లో అధ్యక్ష పదవీకాలా న్ని నాలుగు నుంచి ఆరేళ్లకు పెంచారు. ఈ చట్ట సవరణ చేశాక 2012లో పుతిన్ మూడోసారి అధ్యక్షపదవికి పోటీచేసి 64 శాతం ఓట్లతో గెలిచారు. తాజా విజయంతో పుతిన్ నియంత జోసెఫ్ స్టాలిన్ తర్వాత రష్యాను ఎక్కువ కాలం పాలించిన నేతగా చరిత్రలో స్థానం సంపాదించుకున్నారు.

జర్మనీ ఛాన్సలర్‌గా ఎన్నికైన మెర్కెల్
ఏంజెలా మెర్కల్ మార్చి 14న జర్మనీ ఛాన్సలర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. కాగా, ఆమె ఈ పదవిని చేపట్టడం ఇది వరుసగా నాలుగోసారి. 709 మంది సభ్యులున్న జర్మన్ పార్లమెంటులో 364 మంది ఆమెకు అనుకూలంగా ఓటేశారు.

నేపాల్ అధ్యక్షురాలిగా విద్యాదేవి తిరిగి ఎన్నిక
విద్యాదేవి భండారీ రెండోసారి నేపాల్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆమె మార్చి 13న జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. భండారీ 2015లో నేపాల్ తొలి మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

యూఎస్ విదేశాంగ మంత్రిగా మైక్ పాంపీ 
అమెరికా విదేశాంగ శాఖ మంత్రిగా మైక్ పాంపీ నియమితులయ్యారు. రెక్స్ టిల్లర్సన్ స్థానంలో పాంపీని నియమిస్తున్నట్లుఅధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మార్చి 13న ప్రకటించారు. జాతీయ భద్రతకు సంబంధించి ఉత్తర కొరియాతో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ట్రంప్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న మైక్ పాంపీని విదేశాంగ మంత్రిగా నియమించారు.

అత్యంత సంపన్న ఎంపీగా జయాబచ్చన్ 
దేశంలోనే అత్యంత సంపన్న ఎంపీగా జయాబచ్చన్ నిలవనున్నారు. ప్రముఖ నటి, సమాజ్‌వాదీ పార్టీ నాయకురాలైన జయాబచ్చన్ యూపీ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె మార్చి 12న సమర్పించిన ప్రమాణపత్రంలో ఆస్తుల విలువను రూ.1000 కోట్లుగా పేర్కొన్నారు. కాగా, ఇప్పటి వరకు దేశంలోనే అత్యంత సంపన్న ఎంపీగా భాజాపాకు చెందిన రవీంద్ర కిశోర్ సిన్హా గుర్తింపు పొందారు. ఆయన 2014లో రాజ్యసభకు ఎన్నికయ్యే నాటికి ఆస్తుల విలువను రూ.800 కోట్లుగా ప్రకటించారు.

నాగాలాండ్ సీఎంగా రియో ప్రమాణం నాగాలాండ్ ముఖ్యమంత్రిగా నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ నేత నీఫియు రియో బాధ్యతలు స్వీకరించారు. మార్చి 8న ఆ రాష్ట్ర గవర్నర్ ఆచార్య.. రియోతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ నేత పాట్టూన్ ప్రమాణం చేశారు. వీరుకాక మరో 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీతో కలసి పీపుల్స్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వాన్ని రియో ఏర్పాటు చేశారు. 
నాగాలాండ్ సీఎంగా రియో బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగోసారి.


త్రిపుర సీఎంగా విప్లవ్ ప్రమాణం 
సుమారు పాతికేళ్ల కమ్యూనిస్టుల పాలన అనంతరం త్రిపురలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా విప్లవ్ కుమార్ దేవ్(48) మార్చి 9న ప్రమాణం చేశారు. అగర్తలాలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తథాగతరాయ్ విప్లవ్‌తో సీఎంగా ప్రమాణం చేయించారు. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ , కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్, బీజేపీ నాయకులు అడ్వాణీ, ఎంఎం జోషి, తాజా మాజీ సీఎం మాణిక్ సర్కార్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. విప్లవ్‌తో పాటు బీజేపీకే చెందిన జిష్ణు దేవ్ వర్మన్ ఉప ముఖ్యమంత్రిగా, మరో ఏడుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. 


ఉబెర్ బ్రాండ్ అంబాసిడర్‌గా కోహ్లి
అంతర్జాతీయ ట్యాక్సీ సేవల సంస్థ ‘ఉబెర్’ తాజాగా ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లిని భారత్‌లో బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. డీల్‌లో భాగంగా ఇకపై ఉబెర్ ఇండియా మార్కెటింగ్, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ప్రచార కార్యక్రమాల్లో కోహ్లి పాల్గొంటారు. ఉబెర్ సంస్థ ఆసియా-పసిఫిక్‌లో బ్రాండ్ అంబాసిడర్‌ను నియమించుకోవడం ఇదే ప్రథమం. గత నెల ఫుట్‌బాల్ ప్లేయర్ మహమద్ సలాహ్‌ను ఈజిప్ట్ మార్కెట్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది.


ట్వీటర్ సీటీవోగా పరాగ్ అగర్వాల్
మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘ట్వీటర్’ తాజాగా పరాగ్ అగర్వాల్‌ను చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా (సీటీవో) నియమించుకుంది. ఈయన ఆడమ్ మెస్జింగర్ స్థానాన్ని భర్తీ చేశారు. ఆడమ్ మెస్జింగర్ 2016 చివరిలో కంపెనీ నుంచి బయటకు వచ్చేశారు. ఇకపోతే అగర్వాల్ ఐఐటీ-బాంబే పూర్వ విద్యార్థి. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ లో పీహెచ్‌డీ పూర్తిచేశారు. ఈయన 2011లో యాడ్‌‌స ఇంజనీర్‌గా ట్వీటర్‌లో చేరారు. ట్వీటర్‌లో చేరకముందు మైక్రోసాఫ్ట్ రీసెర్చ్, యాహూ రీసెర్చ్, ఏటీఅండ్‌టీ ల్యాబ్స్‌తో కలసి డేటా మేనేజ్‌మెంట్‌పై రీసెర్చ్ చేశారు. 


నేపాల్ అధ్యక్షురాలిగా విద్యా దేవి భండారీ
నేపాల్ అధ్యక్షురాలిగా విద్యా దేవి భండారీ(56) మార్చి 13న రెండోసారి ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షురాలు, లెఫ్ట్ కూటమి అభ్యర్థి అయిన భండారీ.. నేపాలీ కాంగ్రెస్ అభ్యర్థి కుమారి లక్ష్మీ రాయ్‌పై గెలుపొందారు. ఎన్నికల్లో భండారీకి 39,275 ఓట్లు, లక్ష్మీ రాయ్‌కు 11,730 ఓట్లు దక్కాయి. 1994, 1999లో రెండు సార్లు నేపాల్ పార్లమెంట్‌కు ఎన్నికైన భండారీ 2015లో నేపాల్ తొలి మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు.


మహారాష్ట్ర రైతు మార్చ్ సారథులు వీరే
మహారాష్ర్టలో దాదాపు 50 వేల మంది రైతులు, ఆదివాసీలు 180 కిలోమీటర్లు నడిచి ముంబై చేరుకొని శాంతియుతంగా ఉద్యమించడం వెనుక నలుగురు సారథులు ఉన్నారు. వారే సీపీఎం ఎమ్మెల్యే జీవా పాండు గావిట్, ఏబీకేఎస్ అధ్యక్షుడు అశోక్ ధావలే, ఏబీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి అజిత్ నవ్‌లే మరియు ఏబీకేఎస్ సంయుక్త కార్యదర్శి విజూ కృష్ణన్. ఈ ఉద్యమంలో ఎలాంటి అపశృతి చోటు చేసుకోకుండా క్రమశిక్షణతో, శాంతియుతంగా ప్రభుత్వం నుంచి హామీలు పొంది విజయవంతంగా ముగించడంలో వీరు సఫలమయ్యారు.
జీవా పాండు గావిట్: నాసిక్ జిల్లాలోని కాల్వన్ నియోజకవర్గానికి గావిట్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుత మహారాష్ట్ర శాసనసభలో కమ్యూనిస్టు పార్టీలకు చెందిన ఏకై క ఎమ్మెల్యే ఈయనే. అంతేకాదు కాల్వన్ నుంచి ఆయన ఏడుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. తరాల నుంచి సాగుచేస్తున్న అటవీ భూములను తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేస్తూ రైతు పాదయాత్రకు వ్యూహ రచన చేసింది ఈయనే.
అశోక్ ధావలే: రైతుల పోరాటానికి నేతృత్వం వహించింది అఖిల భారతీయ కిసాన్ సభ (ఏబీకేఎస్). సీపీఎం అనుబంధ సంస్థ అయిన ఏబీకేఎస్‌కు అశోక్ ధావలే ఇటీవలే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈయన సామాజిక కార్యకర్త గోదావరి పారులేకర్ సిద్ధాంతాలను గట్టిగా నమ్ముతారు. 1993 నుంచి ఠాణే, పాల్ఘర్ జిల్లాల్లో రైతు సమస్యలపై ధావలే పోరాటాలు సాగిస్తున్నారు. దశాబ్దం క్రితం రాయ్‌గఢ్‌లో ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)కి భూసేకరణను, తాజాగా ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు, ముంబై-నాగపూర్ ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టులకు భూసేకరణను కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 
అజిత్ నవ్‌లే: 2017 జూన్‌లో రైతుల చేత ఆందోళనలు చేయించి ప్రభుత్వం రైతు రుణమాఫీని ప్రకటించేలా చేయడంలో అజిత్ నవ్‌లే పాత్ర ఎంతో కీలకం. ఆ తర్వాత రైతు రుణ మాఫీ విధి విధానాలు ఎలా ఉండాలో నిర్ణయించేందుకు ప్రభుత్వం ఓ కమిటీని నియమించి అజిత్‌ను కూడా అందులో సభ్యుడిగా చేర్చింది.
విజూ కృష్ణన్: కేరళకు చెందిన, ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) పూర్వ విద్యార్థి అయిన విజూ కృష్ణన్ పాత్ర కూడా రైతు పాదయాత్ర విజయవంతం కావడంలో కీలకమైనది. 1946లో కేరళలోని కన్నూర్ సమీపంలోని కరివేల్లూరు అనే గ్రామంలో రైతులు బ్రిటిష్ వారి సామ్రాజ్య, భూస్వామ్య విధానాలపై తిరుగుబాటు చేశారు. విజూ కృష్ణన్ కూడా అదే గ్రామానికి చెందిన వారు. దాదాపు 70 ఏళ్ల తర్వాత అలాంటి డిమాండ్లతోనే మహారాష్ట్ర రైతులు ఉద్యమిస్తుండటంతో ఆయన వారితో జతకలిశారు.


ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కన్నుమూత విశ్వవిఖ్యాత ఖగోళ, సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ (76) కన్నుమూశారు. బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం సమీపంలో గల తన ఇంట్లో మార్చి 13న తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ‘మా నాన్న మరణం మమ్మల్ని తీవ్ర వేదనకు గురిచేస్తోంది. ఆయన గొప్ప శాస్త్రజ్ఞుడు. అంతకుమించి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన మనిషి. ఆయన పరిశోధనలు, ఆవిష్కరణలను రాబోయే తరతరాలు గుర్తుంచుకుంటాయి. నాన్న మరణం మా కుటుంబానికే కాదు, యావత్ ప్రపంచానికి తీరని లోటు’ అని హాకింగ్ ముగ్గురు పిల్లలు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌లో 1942, జనవరి 8న జన్మించిన స్టీఫెన్ విలియం హాకింగ్ అతి తక్కువ కాలంలోనే అల్బర్ట్ ఐన్‌స్టీన్, సర్ ఐజాక్ న్యూటన్ వంటి శాస్త్రవేత్తల సరసన నిలిచారు. 1964లో 22 ఏళ్ల వయసులో హాకింగ్‌కు అమియోమోట్రోపిక్ లాటరల్ స్లైరోసిస్ వ్యాధి సోకడంతో కొన్నేళ్లకే మరణిస్తాడని అందరూ అనుకున్నారు. నరాలు, వెన్నుపూసపై ప్రభావం చూపే ఈ వ్యాధి అతన్ని చలన రహితున్ని (పక్షవాతం)చేసింది. 1985లో నిమోనియా రావడంతో పూర్తిగా వీల్ చైర్‌కే పరిమితమయ్యారు. శరీరం అంతా పక్షవాతం రావడంవల్ల చేతి చిటికెన వేలి కదలికల సాయంతో ట్రేడ్‌మార్క్ వాయిస్ సింథసైజర్ ద్వారా తన ఆలోచనలను తెలిపేవారు. 32 ఏళ్ల ప్రాయంలో అత్యంత చిన్న వయసు కలిగిన సైంటిస్టులలో ఒకరిగా బ్రిటన్ ప్రతిష్టాత్మక శాస్త్రీయ సంస్థ అయిన రాయల్ సొసైటీ హాకింగ్‌ను గుర్తించింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఆస్ట్రానమీ (ఖగోళ శాస్త్రం), కాస్మాలజీ (విశ్వనిర్మాణ శాస్త్రం)లను అధ్యయనం చేసిన హాకింగ్, 1979లో కేంబ్రిడ్జి యూనివర్సిటీలో మాథమాటిక్స్ లుకేసియన్ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. హాకింగ్స్‌కి ముందు ఈ హోదాలో న్యూటన్ పనిచేశారు.
హాకింగ్ పరిశోధనలు
1970: ఈ విశ్వం మొత్తం సింగుల్యారిటీ ద్వారా ఏర్పడింది. మనకు కనిపిస్తున్న గ్రహాలు, నక్షత్రాలు అన్నిరకాల ఇతర పదార్థాలు కంటికి కనిపించనంత చిన్న గుళిక స్థాయికి కుంచించుకుపోతే అప్పుడు విశ్వం సాంద్రత, బరువు అనంతమవుతాయి. అంతరిక్షం, కాలం అన్నీ అందులోనే ఇమిడి ఉంటాయి. ఈ భావనను సింగ్యులారిటీ అంటారు.
1972-74 కృష్ణబిలాల యంత్రాంగం: విశ్వంలో అక్కడక్కడా అదృశ్యంగా ఉండే కృష్ణబిలాల నుంచి కూడా రేడియోధార్మికత వెలువడుతూ ఉంటుందని ప్రతిపాదన. 
1981 ఇన్ఫర్మేషన్ పారడాక్స్: కృష్ణబిలంలోకి వెళ్లే పదార్థం, సమాచారం ఏదైనా సరే.. అది ఆవిరి అవడంతో ఎవరికీ అందకుండా పోతుంది. 
1983 అనంత విశ్వం: అంతరిక్షం-కాలాలకు సంబంధించి ఈ విశ్వానికి సరిహద్దులు లేవు 
1988 కాలం: కాలమనేది దూసుకుపోతున్న మూడు బాణాల వంటిదని హాకింగ్ అంచనా వేశారు. థెర్మోడైనమిక్స్ ఒక బాణమైతే... మిగిలిన రెండు ఖగోళ, మానసిక సంబంధమైనవి. 
2006: ఈ విశ్వం వేర్వేరు స్థితుల నుంచి ఉనికిలోకి వచ్చింది. 
హాకింగ్ ఇంటర్వ్యూల్లో చెప్పిన కొన్ని సత్యాలు
నా లక్ష్యం చాలా సింపుల్. ఈ విశ్వం గురించి సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. విశ్వం ఇప్పుడున్నట్లే ఉండేందుకు కారణమేంటి? అసలు.. ఎందుకుంది? వంటి ప్రశ్నలకు జవాబులు వెతకాలి.
మనం భూమిని ఖాళీ చేయాల్సిన సమయం ఎంతో దూరంలో లేదు. మరో వందేళ్లలోనే మనం నివాసయోగ్యంగా ఉండే మరో గ్రహాన్ని వెతుక్కోవాలి. మితిమీరిన జనాభా, వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులు, భూమికి అత్యంత సమీపంగా వస్తున్న గ్రహశకలాలతో ఇక భూమిపై జీవించడం దుర్లభంగా మారుతుంది’ - బీబీసీ డాక్యుమెంటరీ కిచ్చిన ఇంటర్వ్యూలో
మరణం తర్వాత జీవితం లేదు. స్వర్గం, నరకం అన్నవి అసలే లేవు. చావు అంటే భయం ఉన్నవారి కోసం అలాంటి కట్టు కథలు అల్లారు. మన మెదడు ఒక కంప్యూటర్ లాంటిది. కంప్యూటర్‌లో విడిభాగాలు పాడైతే అదెలా పనిచేయదో మెదడు కూడా అంతే.. పనిచేయడం ఆగిపోతుంది. నాకు చావంటే భయం లేదు. అలాగని వెంటనే మరణించాలని లేదు. నేను కన్నుమూసేలోపు చేయాల్సింది చాలా ఉంది. జీవించి ఉన్న సమయంలోనే మనలోని శక్తి సామర్థ్యాల్ని సమర్థంగా వినియోగించుకోవాలి. -2011లో గార్డియన్ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో 
హాకింగ్ 5 అద్భుత రచనలు 
మై బ్రీఫ్ హిస్టరీ: ఇది హాకింగ్ ఆత్మకథ లాంటిది. లండన్‌లో హాయిగా సాగిన తన బాల్యం.. బెట్స్ కడుతూ తన మిత్రులతో సరదాగా గడిచిన యవ్వనం.. మేధావిగా, ప్రఖ్యాత సైద్ధాంతిక శాస్త్రవేత్తగా తన పరిణామం.. ఈ వివరాలన్నింటినీ ‘మై బ్రీఫ్ హిస్టరీ’లో ఆసక్తికరంగా హాకింగ్ వివరిస్తారు. పాఠకులకు తెలియని ఒక కొత్త హాకింగ్‌ను, సరదాపరుడు, చతురుడైన హాకింగ్‌ను ఈ పుస్తకంలో ఆయన పరిచయం చేస్తారు. ఇందులోని అరుదైన ఫొటోగ్రాఫ్‌లు పాఠకులకు అదనపు ఆసక్తిని కలిగిస్తాయి. 
ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్: భౌతిక, ఖగోళ సిద్ధాంతాలు సామాన్యులకు అర్థమయ్యే లా హాకింగ్ ఈ పుస్తకాన్ని 1988లో రాశారు. ఇందులో విశ్వం ఆవిర్భావం, విస్తరణ, అంతరిక్షం, కాలంతో పాటు గురుత్వాకర్షణ, కృష్ణబిలాలను సరళమైన రీతిలో హాకింగ్ వివరించారు. 2001 నాటికి 35 భాషల్లో తర్జుమా అయింది. 
ది గ్రాండ్ డిజైన్: ఈ పుస్తకాన్ని లియోనార్డ్ మ్లోడినౌ అనే మరో భౌతికశాస్త్రవేత్తతో కలసి హాకింగ్ 2010లో రచించారు. బిగ్‌బ్యాంగ్(విశ్వ ఆవిర్భావం) భౌతికశాస్త్ర నియమాల ఆధారంగానే జరిగిందనీ, ఇందులో దేవుడి పాత్రేమీ లేదని ఈ పుస్తకంలో హాకింగ్ స్పష్టం చేశారు. విశ్వం పుట్టుకను తెలుసుకునేందుకు దేవుడ్ని అన్వేషించాల్సిన అవసరం లేదన్నారు. ‘దేవుడు లేడని ఎవ్వరూ నిరూపించలేరు. కానీ సైన్స్ దేవుడి అవసరం లేకుండా చేస్తుంది’ అని అన్నారు. 
యూనివర్స్ ఇన్ ఏ నట్‌షెల్: ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ పుస్తకానికి సీక్వెల్‌గా హాకింగ్ దీన్ని 2001లో రాశారు. ఇందులో తన పరిశోధనలతో పాటు క్వాంటమ్ మెకానిక్స్, ఆధునిక భౌతికశాస్త్ర సిద్ధాంతాలు, ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్తలైన ఐన్‌స్టీన్, రిచర్డ్ ఫైన్‌మెన్‌ల సిద్ధాంతాలను ఇందులో హాకింగ్ వివరించారు. ఈ పుస్తకం 2002లో అవెన్టిస్ ప్రైజ్‌కు ఎంపికై ంది.
జార్జ్‌స్ సీక్రెట్ కీ టు యూనివర్స్: కుమార్తె లూసీతో కలసి హాకింగ్ 2007లో చిన్నారుల కోసం రాసిన పుస్తకమిది. ఇందులో కాస్మోస్ అనే శక్తిమంతమైన కంప్యూటర్ సాయంతో చిన్నారులు సుసన్, రింగో, ఎరిక్, జార్జ్‌లతో పాటు డా.రీపర్ సాహసాలు చేస్తారు. కథల రూపంలో విశ్వంలోని సంక్లిష్ట అంశాలను సులభంగా అర్థమయ్యేలా హాకింగ్ ఇందులో వివరించారు.

కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మృతి కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి శివైక్యం పొందారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. కాంచీపురంలోని ఓ ఆస్పత్రిలో ఫిబ్రవరి 28న ఉదయం 9 గంటలకు జయేంద్ర తుదిశ్వాస విడిచారు. 

కంచి మఠానికి 69వ పీఠాధిపతి
జయేంద్ర సరస్వతి 19 ఏళ్ల వయస్సులోనే కంచి మఠానికి యువ పీఠాధిపతిగా పట్టాభిషక్తులయ్యారు. 1935 జూలై 18వ తేదీ తమిళనాడులోని నేటి తంజావూరు జిల్లాలోని ఇరుల్‌నీక్కి గ్రామంలో జన్మించిన జయేంద్ర సరస్వతి అసలు పేరు సుబ్రహ్మణ్య మాదే అయ్యర్. చిన్న తనంలోనే హిందూ మత పెద్దలతో కలిసి ఆధ్యాత్మిక బాటలో నడిచారు. అప్పటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతిస్వామి సుబ్రహ్మణ్య మాదే అయ్యర్‌ను 19 ఏళ్ల వయస్సుల్లో జయేంద్ర సరస్వతిగా నామకరణం చేస్తూ 1954లో మార్చి 22న కంచిమఠానికి 69వ పీఠాధిపతిని చేశారు.

70వ పీఠాధిపతిగా శంకర విజయేంద్ర 
జయేంద్ర సరస్వతి శివక్యైం పొందడంతో కంచి కామకోటి మఠం 70వ పీఠాధిపతిగా శంకర విజయేంద్ర సరస్వతికి పట్టాభిషేకం చేయనున్నారు. ఈయన అసలు పేరు శంకరనారాయణన్. 1969 మార్చి 18న జన్మించారు. తిరువళ్లూరు జిల్లా ఆరణి సమీపంలోని పెరియపాళయం గ్రామం ఆయన స్వస్థలం. 1983 మే 29న పోలూరులో ఆధ్యాత్మిక గురువయ్యారు. 

డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన హర్మన్ ప్రీత్‌కౌర్ 
భారత మహిళల టి20 క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పంజాబ్ పోలీస్ శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పొలీస్ (డీఎస్పీ)గా మార్చి 1న బాధ్యతలు స్వీకరించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సురేశ్ అరోరా ఆమె యూనిఫామ్‌కు బ్యాడ్జిలను అలంకరించి అభినందనలు తెలిపారు.
మహిళల వన్డే ప్రపంచ కప్‌లో హర్మన్ ప్రీత్ అద్భుత ప్రదర్శనకు గాను ఆమెకు పంజాబ్ ప్రభుత్వం ఉద్యోగాన్ని ఇచ్చింది. 


ప్రముఖ కవి నాయని కృష్ణమూర్తి కన్నుమూత ప్రముఖ కవి, సాహితీవేత్త, విజయవాణి ప్రింటర్స్, విజయవాణి విద్యా సంస్థల అధినేత నాయని కృష్ణమూర్తి (67) మరణించారు. గత కొన్ని రోజులుగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో మార్చి 1న తుదిశ్వాస విడిచారు. 
చిత్తూరు జిల్లా నడిమిచెర్లలో 1951లో కృష్ణమూర్తి జన్మించారు. బాల్యం నుంచే సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్న నాయని తన 23 ఏళ్ల వయసులో యామినీ కుంతలాలు అనే నవల రాశారు. ఈ నవలకు 1974 ఉగాది నవలల పోటీలో తృతీయ బహుమతి లభించింది. అనంతరం కొంతకాలం బొమ్మరిల్లు, విజయ,నీలిమ పత్రికలకు ఉపసంపాదకులుగా పనిచేశారు. పిల్లల పత్రిక స్నేహబాలను నడిపించారు. సోదరులతో కలిసి మాబడి, పాఠశాల మాసపత్రికలను నిర్వహించారు. తద్వారా గ్రామీణప్రాంత విద్యార్థుల విద్యాభ్యాసానికి తోడ్పడ్డారు. సాక్షరతా సమితి అకడమిక్ కమిటీ చైర్మన్ పదుహేను సంవత్సరాలు పనిచేశారు. నిరంతర విద్యాకేంద్రాలకు వెలుగుబాట వారపత్రికను అందించారు. 

పాక్‌లో సెనేటర్‌గా కృష్ణకుమారి కొహ్లి
పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్‌‌సకు చెందిన కృష్ణకుమారి.. ఆ దేశ సెనెట్‌కు ఎన్నికై న తొలి హిందూ దళిత మహిళగా రికార్డుకెక్కారు. సింధు ప్రావిన్‌‌సలోని థార్ జిల్లాలో ఉన్న మారుమూల ధనగామ్ గ్రామానికి చెందిన కోల్హీ (39).. ఆ ప్రావిన్‌‌సలోని రిజర్వ్ స్థానానికి బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) తరఫున పోటీ చేసి సెనెటర్‌గా గెలుపొందారు. 
మూడేళ్లు జైల్లో..
1979లో ఓ పేద రైతు కుటుంబంలో జన్మించిన కోల్హీ.. మూడేళ్లపాటు తన కుటుంబం, బంధువులతో కలసి ఓ ప్రైవేట్ జైలులో బానిసగా జీవించారు. ఆ ఘటన జరిగినప్పుడు తాను చిన్న పిల్లనని.. మైనార్టీ మహిళలు, చిన్నారుల కోసం పోరాటం సాగించాలని అప్పుడే నిర్ణయించుకున్నాని కృష్ణకుమారి చెప్పారు.


ఫోర్బ్స్ అత్యంత సంపన్నుల జాబితా 2018
2018లో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ నిలిచాడని ఫోర్బ్స్ మ్యాగజైన్ మార్చి 6న వెల్లడించింది. జెఫ్ బెజోస్ ఫోర్బ్స్ శ్రీమంతుల వార్షిక జాబితాలో మొదటి స్థానాన్ని సాధించడం ఇదే మొదటిసారి. గత 24 ఏళ్లలో 18 ఏళ్ల పాటు అత్యంత సంపన్నుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్ బిల్‌గేట్స్ ఈ ఏడాది రెండో స్థానంలో ఉన్నారని పేర్కొంది. ఏడాది కాలంలో అమెజాన్ షేర్లు 59 శాతం పెరగడంతో జెఫ్ బెజోస్ సంపద ఈ ఏడాది దాదాపు రెట్టింపై 11,200 కోట్ల డాలర్లకు పెరిగింది. ఇక రెండో స్థానంలో ఉన్న బిల్‌గేట్స్ సంపద 9,000 కోట్ల డాలర్లుగా ఉంది. ఇక మూడో స్థానంలో 8,400 కోట్ల డాలర్లతో లెజండరీ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ నిలిచారు. 7,200 కోట్ల డాలర్లతో ఫ్రెంచ్ పారిశ్రామికవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ నాలుగో స్థానంలో, 7,100 కోట్ల డాలర్లతో ఫేస్‌బుక్ మార్క్ జుకర్‌బర్గ్ ఐదో స్థానంలో ఉన్నారు. 
119 మంది సంపన్న భారతీయులు... 
భారత్ విషయానికొస్తే, ప్రపంచ బిలియనీర్ల జాబితాలో మొత్తం 119 మంది భారతీయులకు చోటు దక్కింది. వీరిలో 18 మంది కొత్తగా ఈ జాబితాకెక్కారు.అత్యంత సంపన్న భారతీయుడైన రిలయన్‌‌స అధినేత ముకేశ్ అంబానీ ఈ ప్రపంచ సంపన్నుల జాబితాలో 19 వస్థానంలో ఉన్నారు. ఆయన సంపద 4,010 కోట్ల డాలర్లుగా (దాదాపు రూ.2.61 లక్షల కోట్లు) ఉంది.


మేఘాలయ సీఎంగా సంగ్మా ప్రమాణం
మేఘాలయ 12వ ముఖ్యమంత్రిగా నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) చీఫ్ కాన్రాడ్ సంగ్మా బాధ్యతలు స్వీకరించారు. రాజ్‌భవన్‌లో మార్చి 6న సంగ్మాతోపాటు మరో 11 మంది చేత మంత్రులుగా గవర్నర్ గంగా ప్రసాద్ ప్రమాణం చేయించారు. మేఘాలయలో కాంగ్రెస్ 21 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచినా.. రెండే సీట్లు గెలిచిన బీజేపీ ఇతరుల మద్దతు కూడగట్టి ఎన్‌పీపీ అధికారంలోకి వచ్చేలా చక్రం తిప్పింది. 


ఐటీబీపీలో మొదటి కంబాట్ ఆఫీసర్‌గా ప్రకృతి 
ఐటీబీపీ చరిత్రలోనే తొలిసారిగా నేరుగా కంబాట్ అధికారిణిగా ప్రకృతి ఎంపికయ్యారు. బిహార్‌లోని సమస్తీపూర్ జిల్లా ఈమె స్వస్థలం. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్(సీఏపీఎఫ్) కోసం 2016లో యూపీఎస్సీ నిర్వహించిన పరీక్షలో పాతికేళ్ల ప్రకృతి మాత్రమే కంబాట్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. పరీక్ష రాసిన తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి తన కల నిజం చేసుకున్నారు. 
ప్రకృతి బీటెక్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశారు. ప్రస్తుతం పితోర్‌గఢ్‌లోని ఐటీబీపీ యూనిట్‌లో సేవలందిస్తున్నారు. ఐటీబీపీలో మహిళలున్నప్పటికీ వారంతా కానిస్టేబుల్ హోదావాళ్లే. 


పోప్ పాల్ VIకు సెయింట్ గౌరవం 
1960ల్లో క్యాథలిక్ చర్చిలో రెండవ వాటికన్ మండలి ద్వారా సమూల మార్పులు తీసుకొచ్చిన పోప్ ఆరవ పాల్‌ను సెయింట్‌గా గుర్తించి గౌరవించనున్నట్లు వాటికన్ మార్చి 7న ప్రకటించింది. శాన్ సాల్వడార్‌లో క్రైస్తవ ప్రధాన మతగురువుగా పనిచేస్తూ 1980ల్లో సామాజిక న్యాయం, ప్రజల అణచివేతలపై ప్రశ్నించి హత్యకు గురైన ఆస్కార్ రొమెరోకు కూడా సెయింట్‌హుడ్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై పోప్ ఫ్రాన్సిస్ మార్చి 6న సంతకం చేశారు. 

ఫోర్బ్స్ అండర్-40 బిలియనీర్లలో విజయ్‌శేఖర్
ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో మొత్తం 2,208 మంది ఉండగా... అందులో 40 ఏళ్ల లోపువారు కేవలం 63 మంది మాత్రమే. ఈ మేరకు ఫోర్బ్స్ అండర్ -40 బిలియనీర్ల జాబితాను మార్చి 7న ప్రకటించింది. పేటీఎం వ్యవస్థాపకులు విజయ్‌శేఖర్ శర్మ భారత్ తరఫున ఫోర్బ్స్ అండర్-40 బలియనీర్స్ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. 39 ఏళ్ల వయసున్న శర్మ ఇప్పుడు భారత్‌లో అత్యంత పిన్న వయసు కలిగిన బిలియనీర్ అని ఫోర్బ్స్ వెల్లడించింది. ఆయన సంపద 170 కోట్ల డాలర్లుగా ఉంటుందని అంచనా వేసింది. 2011లో పేటీఎం మొబైల్ వ్యాలెట్‌ను శేఖర్ శర్మ ప్రారంభించారు. 

ఫిబ్రవరి 2018 వ్యక్తులు

క్రైస్తవ మత ప్రబోధకుడు బిల్లీ గ్రాహమ్ కన్నుమూత విఖ్యాత క్రైస్తవ మత ప్రబోధకుడు, ప్రచారకర్త బిల్లీ గ్రాహమ్ కన్ను మూశారు. ఆయన వయసు 99 ఏళ్లు. గత కొన్నేళ్లుగా ప్రొస్టేట్ కేన్సర్, న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన ఫిబ్రవరి 21న ఉత్తర కరోలినాలోని తన స్వగృహంలో మృతిచెందారు. అమెరికాలో ఉదారవాద ప్రొటెస్టాంట్లు, రోమన్ కేథలిక్‌లకు పోటీగా మత ప్రచార కార్యక్రమాలను ఆయన ఒక ఉద్యమంలా నిర్వహించారు. 185కు పైగా దేశాల్లో సదస్సులు, సమావేశాలు నిర్వహించి సంప్రదాయ క్రైస్తవుల మధ్య అంతర్జాతీయ స్థాయిలో సంబంధాలు నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారు. కమ్యూనిస్టుల పాలనలోని క్రైస్తవులకు కూడా ఆశా కిరణంగా నిలిచారు. మత బోధనల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మందికి చేరువైంది గ్రాహమే. 
‘అమెరికా పాస్టర్’గా పేరొందిన గ్రాహమ్.. ఐసన్‌హోవర్ నుంచి జార్జి డబ్ల్యూ బుష్ వరకు పలువురు అమెరికా అధ్యక్షులకు ఆధ్యాత్మిక సలహాదారుగా, సన్నిహితుడిగా వ్యవహరించారు. 

ప్రముఖ సినీనటి శ్రీదేవి కన్నుమూత 
ఐదు దశాబ్దాలపాటు వెండితెరను ఏలిన అతిలోక సుందరి శ్రీదేవి (54) కన్నుమూశారు. ఫిబ్రవరి 24న దుబాయ్‌లో ఆమె గుండెపోటుతో కన్నుమూశారు. తన మేనల్లుడు మోహిత్ మార్వా వివాహం కోసం భర్త బోనీ కపూర్, చిన్న కూతురు ఖుషీతో కలసి శ్రీదేవి దుబాయ్ వెళ్లారు. 
నాలుగేళ్ల వయసు నుంచే.. 
తమిళనాడులోని శివకాశిలో 1963 ఆగస్టు 13న జన్మించిన శ్రీదేవి(అసలు పేరు అమ్మయంగార్ అయ్యప్పన్) నాలుగేళ్ల వయసు నుంచే వెండితెరపై వెలిగారు. 1967లో ‘కందన్ కరుణై’ చిత్రంలో బాలనటిగా రంగప్రవేశం చేశారు. ‘కొందరు సిల్వర్ స్పూన్‌తో పుడతారు.. శ్రీదేవి సిల్వర్ స్క్రీన్‌తో పుట్టింది’ అనే నానుడి స్థిరపడేలా బాలనటిగా దూసుకుపోయారు. 11వ ఏటనే మలయాళంలో హీరోయిన్‌గా నటించినా 13వ ఏట తెలుగులో ‘అనురాగాలు’ (1976), 14వ ఏట ‘మా బంగారక్క’ (1977) సినిమాలతో తెలుగు హీరోయిన్‌గా మారారు. ‘పదహారేళ్ల వయసు’ (1978) ఘన విజయంతో ఆమె దశ తిరిగింది. ఆ తర్వాత రెండు దశాబ్దాల పాటు ఇటు దక్షిణాదిని, అటు ఉత్తరాదిని ఏలారు. 

యుద్ధవిమానం నడిపిన అవనీ చతుర్వేది
యుద్ధ విమానం నడిపిన తొలి భారతీయ మహిళగా అవనీ చతుర్వేది గుర్తింపు పొందారు. ఆమె ఫిబ్రవరి 19న జామ్‌నగర్ స్థావరం నుంచి మిగ్-21 బైసన్‌ను నడిపారు.

స్వచ్ఛభారత్ వృద్ధురాలు కున్వర్ బాయ్ మృతి
స్వచ్ఛభారత్ అభియాన్ చిహ్నంగా పేరొందిన 106 ఏళ్ల వృద్ధురాలు కున్వర్ బాయ్ ఫిబ్రవరి 23న ఛత్తీస్‌గఢ్‌లో మరణించారు. స్వచ్ఛభారత్ స్ఫూర్తితో 2016లో తనకున్న కొన్ని మేకలను అమ్మేసి..ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకోవడంతో కున్వర్ బాయ్ పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆమెను ప్రత్యేకంగా సన్మానించారు.

నీరవ్, చోక్సీల పాస్‌పోర్టులు రద్దుపంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ)ను రూ. 11,400 కోట్ల మేర మోసగించిన కేసులో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, చోక్సీల పాస్‌పోర్టుల్ని విదేశాంగ శాఖ 4 వారాల పాటు రద్దు చేసింది. వారంలోగా తమ ముందు హాజరుకావాలని ఆదేశిస్తూ వారిద్దరికీ మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద ఈడీ సమన్లు జారీ చేసింది. నీరవ్, చోక్సీలు దేశం విడిచి పారిపోవడంతో.. ఆ ఇద్దరి కంపెనీల డెరైక్టర్లకు నోటీసులను పంపింది. నీరవ్ మోదీ తన పేరు మీదే నగల దుకాణాల్ని నిర్వహిస్తుండగా, గీతాంజలి జెమ్స్‌కు చోక్సీ ప్రమోటర్‌గా ఉన్నారు. 


భారత్‌లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పర్యటన 
ఏడురోజుల పర్యటనలో భాగంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కుటుంబ సమేతంగా ఫిబ్రవరి 17న భారత్‌కు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో భేటీ కానున్న ట్రూడో రక్షణ, ఉగ్రవాదంసహా పలు కీలకాంశాలపై చర్చించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ట్రూడో 18న తాజ్‌మహల్‌ను సందర్శించారు. అనంతరం గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని, గాంధీనగర్‌లోని అక్షర్‌ధామ్ ఆలయాన్ని సందర్శించారు. 


బంగ్లా మాజీ ప్రధాని జియాకు జైలు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, ప్రతిపక్ష నాయకురాలు ఖలీదా జియా(72)కు ఓ అవినీతి కేసులో ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. దీంతో డిసెంబర్‌లో జరిగే సాధారణ ఎన్నికల్లో పోటీచేయకుండా ఆమె అనర్హతకు గురయ్యే వీలుంది. తన భర్త, మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహ్మాన్ జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన అనాథ శరణాలయానికి సేకరించిన విదేశీ నిధులను దుర్వినియోగం చేసిన కేసులో ఢాకా ప్రత్యేక కోర్టు ఫిబ్రవరి 8న ఈ తీర్పు వెలువరించింది. జియా కొడుకు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తారిక్‌నూ దోషిగా తేల్చిన కోర్టు..ఆయనతో పాటు మరో నలుగురికి 10 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం తారిక్ లండన్‌లో అజ్ఞాతంలో ఉన్నారు. 
ప్రతిపక్ష బీఎన్‌పీకి అధినేత్రిగా వ్యవహరిస్తున్న జియా.. మూడుసార్లు ప్రధానిగా పనిచేశారు. 


బాటా’ అంబాసిడర్‌గా స్మృతి మంధన 
భారత మహిళా జట్టు క్రికెటర్ స్మృతి మంధనను ప్రముఖ పాదరక్షల ఉత్పత్తి సంస్థ బాటా తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసింది. సంస్థకు చెందిన క్రీడా సంబంధ బ్రాండ్ ‘పవర్’కు అంబాసిడర్‌గా స్మృతి వ్యవహరించనుంది. 2017లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో విశేషంగా రాణించిన స్మృతి.. తాజాగా ఫిబ్రవరి 7న దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలోనూ సెంచరీ చేసి సత్తాచాటింది. 


ఐసీసీ తొలి మహిళా స్వతంత్ర డెరైక్టర్‌గా ఇంద్రా నూయీపెప్సికో చైర్మన్, సీఈవో ఇంద్రా నూయీ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తొలి మహిళా స్వతంత్ర డెరైక్టర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఫిబ్రవరి 9న నియామకం ఖరారైంది. ఆమె ఈ ఏడాది జూన్‌లో బోర్డులో చేరతారు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ మార్కెట్‌ను విస్తృతం చేసే ఉద్దేశంతో గతేడాది జూన్‌లో ఐసీసీ నియమావళిలో భారీ సంస్కరణలు చేపట్టారు. దీనిలో భాగంగా బోర్డులో తప్పనిసరిగా ఒక మహిళా స్వతంత్ర డెరైక్టర్ ఉండాలని సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. నూయీ నియామకాన్ని ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ స్వాగతించారు. తమ పాలనా వ్యవహారాల పరిధి పెంపొందించుకునేందుకు ఆమె సామర్థ్యం ఎంతగానో తోడ్పడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి స్వతంత్ర డెరైక్టర్ పదవి రెండేళ్ల పాటు ఉంటుంది. దీనిని వరుసగా రెండు దఫాల్లో ఆరేళ్ల వరకు పొడిగించుకోవచ్చు. 


పాక్ ఉద్యమకారిణి అస్మా జహంగీర్ కన్నుమూత
పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది, మానవహక్కుల ఉద్యమకారిణి అస్మా జహంగీర్(66) ఫిబ్రవరి 11న కన్నుమూశారు. 1952లో లాహోర్ జన్మించిన అస్మా, పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి 1978లో ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని 1983లో అప్పటి పాక్ నియంత జియా ఉల్ హక్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొనడంతో సైనిక ప్రభుత్వం ఆమెను జైల్లో నిర్బంధించింది. జైలు నుంచి విడుదలైన అనంతరం 1986లో స్విట్జర్లాండ్‌లోని జెనీవాకు వెళ్లిన ఆమె..డిఫెన్‌‌స ఫర్ చిల్డ్రన్ ఇంటర్నేషనల్ సంస్థకు రెండేళ్లు ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించారు. 1987లో పాకిస్తాన్‌లో స్థాపించిన జాతీయ మానవహక్కుల సంఘానికి 1993 వరకూ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు.
పాకిస్తాన్ సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్‌కు తొలి అధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టించిన అస్మా.. శక్తిమంతమైన ఆర్మీ, నిఘా సంస్థ ఐఎస్‌ఐల వ్యవహారశైలిని తీవ్రంగా విమర్శించేవారు. మానవహక్కుల రంగంలో చేసిన కృషికి గానూ 2014లో రైట్ లైవ్లీహుడ్ అవార్డు, 2010లో ఫ్రీడమ్ అవార్డు, హిలాల్ ఏ ఇంతియాజ్ అవార్డులను ఆమె అందుకున్నారు.


దేశంలో ధనిక సీఎం చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ.177 కోట్లకు పైగా ఆస్తులతో దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా నిలిచినట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) ఓ నివేదిక విడుదల చేసింది. అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పెమా ఖండూ రూ.129 కోట్లకుపైగా ఆస్తులతో రెండోస్థానంలో నిలవగా, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రూ.48 కోట్లతో మూడోస్థానంలో ఉన్నాడు. మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల్లో 24 మంది (81 శాతం) కోటీశ్వరులున్నారు. వీరి సగటు ఆస్తి రూ.16.18 కోట్లుగా ఉంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సీఎంల అఫిడవిట్లను పరిశీలించిన ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్(ఎన్‌ఎల్‌డబ్ల్యూ)లు ఈ నివేదికను రూపొందించాయి.
అతిపేద ముఖ్యమంత్రుల్లో త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ రూ.27 లక్షల ఆస్తులతో తొలిస్థానంలో నిలవగా, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ(రూ.30 లక్షలుపైగా), జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ(రూ.56 లక్షలు) తర్వాతి స్థానాలో నిలిచారు.
మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల్లో 11 మంది (35శాతం)పై క్రిమినల్ కేసులు, దాదాపు 26 శాతం సీఎంలపై హత్య, హత్యాయత్నం, మోసం, బెదిరింపులు వంటి తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. విద్యార్హతల విషయంలో మొత్తం ముఖ్యమంత్రుల్లో 10 శాతం మంది పన్నెండో తరగతి ఉత్తీర్ణులు కాగా, 39 శాతం మంది డిగ్రీ, 32 శాతం మంది వృత్తివిద్యా డిగ్రీ, 16 శాతం మంది పీజీ, 3 శాతం మంది డాక్టరేట్ సాధించారు.

కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా చంద్రశేఖర కంబార
కేంద్ర సాహిత్య అకాడమీ నూతన అధ్యక్షుడిగా కన్నడ విశ్వవిద్యాలయ పూర్వ ఉపకులపతి ఆచార్య చంద్రశేఖర కంబార ఫిబ్రవరి 12న ఎన్నికయ్యారు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీతైన కంబార..కవిగా, నాటకరంగ కళాకారుడిగా విశేష గుర్తింపు పొందారు.

బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా అబ్దుల్ హమీద్ 
బంగ్లాదేశ్ అధ్యక్షడిగా అబ్దుల్ హమీద్ ఫిబ్రవరి 7న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో రెండోసారి బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు.

బళ్లారి ఎంపీకి ట్రంప్ ఆహ్వానం 
కర్ణాటకలోని బళ్లారి లోక్‌సభ సభ్యుడు శ్రీరాములును అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తమ దేశానికి ఆహ్వానించారు. అమెరికా అధ్యక్షుడిగా గెలిచాక 130 దేశాల ప్రముఖులను ఆహ్వానించి ఆ దేశ సంప్రదాయాల ప్రకారం విందు ఇవ్వడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 7, 8 తేదీల్లో ఏర్పాటు చేసిన విందుకు భారతదేశం నుంచి ఇద్దరు నేతలను ఎంపిక చేశారు. వీరిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఒకరు కాగా, బళ్లారి ఎంపీ శ్రీరాములు మరొకరు.

కర్ణాటక హైకోర్టు సీజేగా జస్టిస్ దినేశ్ మహేశ్వరి
కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దినేశ్ మహేశ్వరి నియామకం దాదాపుగా ఖాయమైంది. ఈ మేరకు ఫిబ్రవరి 2న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతత్వంలోని కొలీజియం జస్టిస్ దినేశ్ మహేశ్వరి పేరును ప్రతిపాదించింది. అక్టోబర్ 9వ తేదీన జస్టిస్ ఎస్‌కే ముఖర్జీ పదవి విరమణ చేయగా.. అప్పటి నుంచి కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పోస్టు ఖాళీగా ఉంది. దినేశ్ మహేశ్వరి ప్రస్తుతం మేఘాలయా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు.

విద్యార్థుల కోసం మోదీ పుస్తకం - ఎగ్జామ్ వారియర్స్
వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల ఒత్తిడి, ఆందోళనలను దూరం చేసేందుకు తన అనుభవాలతో 25 అధ్యాయాలు (మంత్రాలు, యోగాసనాలతో) పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ రాశారు. ఎగ్జామ్ వారియర్స్ (పరీక్షా యోధులు) పేరుతో రాసిన ఈ పుస్తకాన్ని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, మానవ వనరుల మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఫిబ్రవరి 3న ఢిల్లీలో విడుదల చేశారు. ఈ పుస్తకం రాయటం ద్వారా.. ఇంతవరకు ఏ దేశాధ్యక్షుడు గానీ.. ప్రధాని గానీ సాధించని అరుదైన ఘనతను మోదీ తన ఖాతాలో వేసుకున్నారు. భారత యువతకు అంకితమిచ్చిన ఈ పుస్తకాన్ని ‘ది ఐడియా’ అనే నరేంద్రమోదీ మొబైల్ యాప్‌తో అనుసంధానించారు. 


తేజస్‌లో అమెరికా వాయు సేనాధిపతి 
దేశీయంగా తయారైన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ను అమెరికా వాయు సేనాధిపతి జనరల్ డేవిడ్ గోల్డ్‌ఫీన్ ఫిబ్రవరి 3న నడిపారు. రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉన్న వైమానికస్థావరం వద్ద భారత ఎయిర్ వైస్ మార్షల్ ఏపీ సింగ్‌తో కలసి ఆయన తేజస్‌లో చక్కర్లు కొట్టారు. భారత వాయుసేన ఈ సమాచారాన్ని ట్వీటర్‌లో ప్రకటించింది. భారత, అమెరికా వాయుసేనల మధ్య బంధాన్ని మరింత దృఢపరిచేందుకు కృషిచేస్తానని గోల్డ్‌ఫీన్ తెలిపారు.


నీతి ఆయోగ్ సీఈవో పదవీకాలం పొడిగింపు 
నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమితాబ్ కాంత్ పదవీకాలాన్ని 2019 జూన్ 30 వరకు పొడిగించారు. కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించడంతో అమితాబ్ పదవీకాలాన్ని పొడిగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. కాలపరిమితి రెండేళ్లు ఉండే నీతి ఆయోగ్ సీఈవో పదవిని అమితాబ్ 2016 ఫిబ్రవరి 17న చేపట్టారు. నీతి ఆయోగ్‌లో పదవిచేపట్టకముందు ఆయన పారిశ్రామిక విధాన, ప్రోత్సాహక విభాగం కార్యదర్శిగా పనిచేశారు. అమితాబ్ కేరళ కేడర్‌కు చెందిన 1980 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 

కొత్త డీజీఎంఓ అనిల్ చౌహాన్
భారత సైన్యం నూతన డీజీఎంఓ(డెరైక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్)గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ జనవరి 30న బాధ్యతలు స్వీకరించారు. చౌహాన్‌కు జమ్మూకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లోని చొరబాటు వ్యతిరేక ఆపరేషన్లలో అపార అనుభవం ఉంది.

ఫిడెల్ క్యాస్ట్రో కుమారుడి ఆత్మహత్య
క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో పెద్ద కుమారుడు డియాజ్ బలర్ట్(68) ఫిబ్రవరి 2న హవానాలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన గత కొన్ని నెలలుగా తీవ్ర డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. డియాజ్ రాజకీయాల్లో లేనప్పటికీ అచ్చు తండ్రి పోలికలతో ఉండటంతో అక్కడి వారు ఆయన్ను ఫిడెల్ జూనియర్‌గా పిలుస్తుంటారు. ఫిజిక్స్ శాస్త్రవేత్తయిన డియాజ్.. క్యూబా అణుశక్తి కార్యక్రమంలో కీలకపాత్ర పోషించారు.