Sunday, 11 February 2018

జనవరి 2018 వ్యక్తులు

ప్రముఖ నటీమణి కృష్ణకుమారి కన్నుమూత 
తెలుగు చలనచిత్ర రంగంలో తన ముగ్ధ మనోహర రూపంతో, అద్వితీయ నటనా కౌశలంతో ప్రేక్షకులను కట్టిపడేసిన అలనాటి అందాల తార, ప్రముఖ నటీమణి కృష్ణకుమారి జనవరి 24న బెంగళూరులో కన్నుమూశారు. 1933, మార్చి 6న పశ్చిమ బెంగాల్‌లోని నౌహతిలో కృష్ణకుమారి జన్మించారు. ఆమె భర్త ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రిక మాజీ ఎడిటర్ అజయ్ మోహన్ ఖైతాన్. ప్రముఖ నటీమణి షావుకారు జానకి కృష్ణకుమారికి స్వయానా సోదరి. 
1951లో ‘నవ్వితే నవరత్నాలు’ చిత్రం ద్వారా కృష్ణకుమారి తెరంగ్రేటం చేశారు. అనంతరం పల్లెపడుచు, బంగారు పాప, ఇలవేల్పు, అభిమానం, దేవాంతకుడు, భార్యాభర్తలు, కులగోత్రాలు తదితర చిత్రాల్లో నటించి తెలుగు చిత్ర సీమపై చెరగని ముద్ర వేశారు. ఆమె నటనా కౌశలానికి మూడుసార్లు జాతీయ అవార్డు, రాష్ట్ర స్థాయి నంది అవార్డు, కాంచనమాల, సావిత్రి, ఎన్టీఆర్ జాతీయ అవార్డులు వరించాయి. 


దాణా మూడో కేసులోనూ దోషిగా తేలిన లాలూ
దాణా కుంభకోణానికి సంబంధించిన మూడో కేసులోనూ బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు జనవరి 24న దోషిగా తేల్చింది. లాలూతోపాటు మరో మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా కూడా దోషేనని పేర్కొన్న కోర్టు..వీరిద్దరికీ ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.10 లక్షల జరిమానా కూడా విధించింది. వీరు ఒక్కోసారి 5 లక్షల రూపాయలను రెండు దఫాల్లో చెల్లించొచ్చు. జరిమానా కట్టని పక్షంలో వారు మరో ఏడాది సాధారణ జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. 1992-93 మధ్య కాలంలో చాయ్‌బాసా ఖజానా నుంచి రూ. 37.62 కోట్లను వీరు అక్రమంగా కాజేసినట్లు గుర్తించిన సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎస్‌ఎస్ ప్రసాద్.. ఇదే కేసులో మరో 50 మందిని కూడా దోషులుగా తేల్చారు. 

బెంగాలీ నటి సుప్రియా దేవి కన్నుమూత 
బెంగాలీ ప్రముఖ నటి సుప్రియా దేవి(85) జనవరి 26న కన్నుమూశారు. రిత్విక్ ఘటక్ దర్శకత్వం వహించిన ‘మేఘే ఢాకా తారా’ చిత్రంలో నీతా అనే పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చింది. 1933లో మిచ్‌కినాలో జన్మించిన సుప్రియా దేవి 1952లో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 55 ఏళ్లు ఎన్నో చిత్రాల్లో నటించారు. అందులో చౌరింగీ, బాగ్ బందీ ఖేలా, సన్యాసి రాజ్, దేబ్‌దాస్ లాంటి క్లాసిక్ చిత్రాలున్నాయి. 2007లో విడుదలైన నేమ్‌సేక్ చిత్రంలో చివరిసారి నటించారు. దేవికి పద్మశ్రీ అవార్డుతో పాటు బెంగాల్ ప్రభుత్వ పౌర పురస్కారం బంగా విభూషణ్ లభించాయి. 


దేశంలో తొలి మహిళా ఇమామ్‌గా జమిథా
ఇటీవల దళితుల్ని ఆలయాల్లో పూజారులుగా నియమించిన కేరళలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. దేశచరిత్రలోనే తొలిసారిగా ఓ మహిళ శుక్రవారం(జనవరి 26) ప్రార్థనల(జుమ్మా నమాజ్)కు ఇమామ్‌గా వ్యవహరించింది. మలప్పురంలోని ఖురాన్ సున్నత్ సొసైటీ కార్యదర్శి జమిథా(34) తమ సంస్థ కార్యాలయంలో శుక్రవారం నమాజ్‌కు నేతృత్వం వహించారు. ఈ ప్రార్థనలకు పలువురు మహిళలు సహా 80 మంది హాజరయ్యారు. ఈ విషయమై జమిథా స్పందిస్తూ.. పవిత్ర ఖురాన్ పురుషులు, స్త్రీల మధ్య ఎలాంటి వివక్ష చూపదని చెప్పారు. మహిళలు ఇమామ్ కాకూడదని ఖురాన్‌లో ఎక్కడా లేదని వెల్లడించారు. 


విదేశాంగ కార్యదర్శిగా విజయ్ గోఖలే
విదేశాంగ నూతన కార్యదర్శిగా చైనా వ్యవహారాల్లో నిపుణుడైన 1981 ఐఎఫ్‌ఎస్ అధికారి విజయ్ కేశవ్ గోఖలే జనవరి 29న బాధ్యతలు చేపట్టారు. భారత్ - చైనాల మధ్య నెలకొన్న డోక్లామ్ సమస్యను సామరస్యంగా పరిష్కరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 
అమెరికా-భారత్ పౌర అణు ఒప్పందంతో పాటు ఇండియా-చైనాల మధ్య నెలకొన్న డోక్లామ్ సమస్యను సామరస్యంగా పరిష్కరించడంలో కీలకంగా వ్యవహరించిన విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ జనవరి 28న పదవీవిరమణ చేశారు. మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న జైశంకర్.. గత నాలుగు దశాబ్దాల్లో అత్యధిక కాలం విదేశాంగ కార్యదర్శిగా కొనసాగిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ప్రధాని మోదీ 2015, జనవరి 28న విదేశాంగ కార్యదర్శిగా జైశంకర్‌ను నియమించారు. 

హాల్ ఆఫ్ ఫేమ్’లో ఇద్దరు భారతీయులు 
అమెరికా పేటెంట్ అండ్ ట్రేడ్‌మార్క్ ఆఫీస్ (యూఎస్‌పీటీఓ) ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్వెస్టర్స్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో భారత్‌కు చెందిన ప్రొఫెసర్ ఆరోగ్యస్వామి జోసెఫ్ పాల్‌రాజ్, సుమితా మిత్రాలకు చోటు దక్కింది. అత్యంత వేగంగా డేటాను ట్రాన్‌‌సమిట్ చేయడంతో పాటు స్వీకరించేలా వైర్‌లెస్ టెక్నాలజీని రూపొందించినందుకు పాల్‌రాజ్ ఈ ఘనత సాధించారు. నానో కాంపోజిట్ డెంటల్ మెటీరియల్ అభివృద్ధికి కృషి చేసినందుకు సుమితా మిత్రాకు ఈ గౌరవం లభించింది. మే 3న వాషింగ్టన్‌లో ఈ అవార్డును పాల్‌రాజ్, సుమితాలకు అందిస్తారు.

వ్యవసాయ శాస్త్రవేత్త గురు చరణ్ సింగ్ మృతి
ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త గురు చరణ్ సింగ్ కల్కట్(92) జనవరి 27న చండీగఢ్‌లో మరణించారు. పంజాబ్ హరిత విప్లవంలో కీలకపాత్ర పోషించిన కల్కట్.. పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు.

ది టాల్ మ్యాన్ పుస్తకావిష్కరణ
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బిజు పట్నాయక్‌పై గణేశన్ రాసిన ‘ది టాల్ మ్యాన్’ పుస్తకాన్ని జనవరి 27న భువనేశ్వర్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పాల్గొన్నారు.

సుఖోయ్‌లో ప్రయాణించిన రక్షణమంత్రి సీతారామన్ రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జనవరి 17న రెండు సీటర్ల సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధవిమానంలో ప్రయాణించారు. సీతారామన్ రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ ఎయిర్‌బేస్‌లో ఐఏఎఫ్ పెలైట్‌తో కలిసి 45 నిమిషాల సేపు ఆకాశంలో విహరించారు. దీంతో సుఖోయ్‌లో ప్రయాణించిన తొలి మహిళా రక్షణ మంత్రిగా ఆమె చరిత్ర సృష్టించారు. సీతారామన్ కంటే ముందు మాజీ రాష్ట్రపతులు ఏపీజే అబ్దుల్ కలామ్ 2003లో, ప్రతిభా పాటిల్ 2009లో సుఖోయ్‌లో ప్రయాణించారు. సీతారామన్ కంటే ముందు 2003లో అప్పటి రక్షణమంత్రి జార్జ్ ఫెర్నాండేజ్ సుఖోయ్-30 విమానంలో చక్కర్లు కొట్టారు. రక్షణమంత్రి ప్రయాణించిన విమానం 8 వేల మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తూ ధ్వని వేగాన్ని అధిగమించిందని ఓ ఐఏఎఫ్ అధికారి తెలిపారు. 


ఎన్‌ఎస్‌జీ డీజీగా సుదీప్ లఖ్టాకియా అత్యంత ప్రముఖుల వ్యక్తిగత భద్రత బాధ్యతలు చేపట్టే నేషనల్ సెక్యూరిటీ గార్డు(ఎన్‌ఎస్‌జీ) డెరైక్టర్ జనరల్(డీజీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి సుదీప్ లఖ్టాకియా నియమితులయ్యారు. ఈయన నియామకాన్ని ప్రధాన మంత్రి మోదీ అధ్యక్షతన ఉన్న క్యాబినెట్ నియామకాల కమిటీ జనవరి 19న ఆమోదించింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌జీ డీజీగా ఉన్న ఎస్‌పీ సింగ్ జనవరి 31వ తేదీన పదవీ విరమణ చేయనుండగా కేంద్రం తాజా నియామకం చేపట్టింది. 
1984 బ్యాచ్ తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన లఖ్టాకియా ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్ స్పెషల్ డీజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈయన ఈ ఏడాది జూన్‌లో పదవీ విరమణ చేయనున్నారు.‘బ్లాక్ క్యాట్స్’ గా పిలిచే ఎన్‌ఎస్‌జీ గుర్‌గావ్‌లోని మనేసర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది.


ప్రధాన ఎన్నికల కమీషనర్‌గా ఓపీ రావత్కేంద్ర ఎన్నికల సంఘం నూతన ప్రధాన కమిషనర్(సీఈసీ)గా ప్రస్తుత కమిషనర్ ఓం ప్రకాశ్ రావత్ నియమితులయ్యారు. జనవరి 22న పదవీ విరమణ చేసిన ప్రస్తుత సీఈసీ ఏకే జోతి స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. అలాగే ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి అశోక్ లావాసా ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. ఎన్నికల సంఘంలో ప్రస్తుతం సునీల్ అరోరా మరో కమిషనర్‌గా ఉన్నారు. రావత్ ఈ పదవిలో 2018 డిసెంబర్ వరకు కొనసాగుతారు.
1953లో ఉత్తరప్రదేశ్‌లో జన్మించిన రావత్ 1977లో మధ్యప్రదేశ్ కేడర్‌లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. పబ్లిక్ ఎంటర్‌ప్రెజైస్ విభాగంలో కార్యదర్శిగా, రక్షణ శాఖలో డెరైక్టర్‌గా పనిచేశారు. 2004-08 మధ్య కాలంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి బాబూలాల్ గౌర్‌కు ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు.
1980 బ్యాచ్ హరియాణా కేడర్‌కు చెందిన లావాసా కేంద్ర ఆర్థిక, పర్యావరణం, పౌర విమానయానం, విద్యుత్, హోం మంత్రిత్వ శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేశారు.


హర్మన్‌ప్రీత్ కౌర్‌తో ‘సియట్’ ఒప్పందం భారత మహిళా క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో ప్రఖ్యాత టైర్ల ఉత్పత్తుల సంస్థ ‘సియట్’ జత కట్టింది. ఈ సంస్థకు అంబాసిడర్‌గా ఎంపికై న హర్మన్... ఇక ముందు తన బ్యాట్‌పై సియట్ లోగోను ప్రదర్శిస్తుంది. రోహిత్ శర్మ, అజింక్య రహానేలతో ప్రస్తుతం ఒప్పందం కొనసాగిస్తున్న సియట్ ఒక మహిళా క్రికెటర్ బ్యాట్‌కు ఎండార్స్ చేయడం ఇదే మొదటిసారి. గత ఏడాది హర్మన్ వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాపై 171 పరుగుల అద్భుత ఇన్నింగ్‌‌స ఆడింది. మహిళల బిగ్‌బాష్ టి20 లీగ్‌లో ఆడిన తొలి భారత క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. 

మధ్యప్రదేశ్ గవర్నర్‌గా ఆనందిబెన్గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ మధ్యప్రదేశ్ గవర్నర్‌గా నియ మితులయ్యారు. రాష్ర్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ జనవరి 19న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

కార్టూనిస్ట్ చండీ లాహిరీ కన్నుమూతప్రముఖ కార్టూనిస్టు, రచయిత చండీ లాహిరీ (87) జనవరి 18న కోల్‌కతాలో మరణించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన లాహిరీ 1952లో పాత్రికేయుడిగా వృత్తి జీవితం ప్రారంభించారు. తర్వాత కొన్నేళ్లకు పూర్తి స్థాయి కార్టూనిస్టుగా మారి విశేష కీర్తి గడించారు. దీంతోపాటు ఆయన అనేక పుస్తకాలను రచించారు.

ఇస్రో చైర్మన్‌గా శివన్ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చైర్మన్‌గా ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ కె.శివన్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ శివన్‌ను ఇస్రోతో పాటు అంతరిక్ష కమిషన్ చైర్మన్‌గా, అంతరిక్ష విభాగం కార్యదర్శిగా నియమిస్తూ జనవరి 10న నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇస్రో చైర్మన్‌గా ఉన్న ఏఎస్ కిరణ్‌కుమార్ పదవీకాలం జనవరి 18తో పూర్తికానుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 19న శివన్ ఇస్రో ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. మూడేళ్లపాటు శివన్ ఈ పదవుల్లో కొనసాగనున్నారు. 
ప్రస్తుతం ఆయన తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్‌సెంటర్ డెరైక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 1980లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పట్టా పొందిన శివన్..బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్‌‌స(ఐఐఎస్‌సీ)లో మాస్టర్స్ చేశారు. ఇస్రో 1982లో చేపట్టిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్వీ) ప్రాజెక్టుతో శివన్ కెరీర్ ప్రారంభమైంది. భారత జాతీయ ఇంజనీరింగ్ అకాడమీతో పాటు ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, సిస్టమ్స్ సొసైటీ ఆఫ్ ఇండియాలో శివన్ సభ్యుడిగా ఉన్నారు. 


బ్రిటన్ కేబినెట్‌లో నారాయణమూర్తి అల్లుడు టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు రిషి సునాక్‌కు బ్రిటన్ మంత్రి మండలిలో చోటు దక్కింది. ఇటీవల ప్రధాని థెరిసా మే చేపట్టిన కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో రిషితో పాటు మరో ఇద్దరు భారత మూలాలున్న ఎంపీలను కూడా మంత్రి పదవులు వరించాయి. రిచ్‌మాండ్ (యార్క్‌షైర్) నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రిషి సునాక్, స్థానిక ప్రభుత్వం, కమ్యూనిటీస్ శాఖకు సహాయ మంత్రిగా నియమితులయ్యారు. భారత్-బ్రిటన్ మధ్య సంబంధాల బలోపేతానికి ఆయన కృషిచేశారన్న పేరుంది. నారాయణమూర్తి కూతురు అక్షతా మూర్తిని రిషి వివాహమాడారు. 


ఉమ్మడి హైకోర్టు సీజేగా జస్టిస్ రాధాకృష్ణన్తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ తొట్టతిల్ బి.నాయర్ రాధాకృష్ణన్ నియమితులు కానున్నారు. ఆయన నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదముద్ర వేసింది. ఆయన ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగొయ్‌లతో కూడిన కొలీజియం జనవరి 11న సమావేశమై పలు నియామకాలకు ఆమోదముద్ర వేసింది. సుప్రీంకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులతో పాటు పలు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల నియామకాలను ఆమోదిస్తూ కేంద్రానికి సిఫార్సులు చేసింది. వీటిలో భాగంగా ఉమ్మడి హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాధాకృష్ణన్‌ను నియమించాలని కొలీజియం నిర్ణయించింది. కేంద్రం ఆమోదముద్ర అనంతరం కొలీజియం సిఫార్సులు రాష్ట్రపతికి చేరతాయి. అనంతరం రాష్ట్రపతి నియామకపు ఉత్తర్వులు జారీ చేస్తారు.
ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టుకు జస్టిస్ రమేశ్ రంగనాథన్ దాదాపు ఏడాదిన్నరగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జస్టిస్ రాధాకృష్ణన్ సీజేగా రానున్న నేపథ్యంలో జస్టిస్ రమేశ్ రంగనాథన్ ఉమ్మడి హైకోర్టులోనే న్యాయమూర్తిగా కొనసాగుతారని తెలిసింది. హైకోర్టు విభజన పూర్తయ్యాక ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశముంది. 


సరోద్ పండితుడు దాస్‌గుప్తా కన్నుమూతసరోద్ పండితుడు బుద్ధదేవ్ దాస్‌గుప్తా(84) దక్షిణ కోల్‌కతాలో 2018 జనవరి 15న మరణించారు. ఆయన పద్మభూషణ్ అవార్డు గ్రహీత.

విదేశాంగ కార్యదర్శిగా విజయ్ కేశవ్ గోఖలే భారత విదేశాంగ కార్యదర్శిగా విజయ్ కేశవ్ గోఖలే నియమితులయ్యారు. ప్రస్తుతం విదేశాంగ కార్యదర్శిగా ఉన్న ఎస్ జయశంకర్ పదవీకాలం జనవరి 28తో ముగియనుండటంతో.. ఆయన స్థానంలో కేశవ్ గోఖలే నియమితులయ్యారు. ఆయన 1981 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారి.


ఇన్ఫీ సీఈవో పరేఖ్‌కు రూ.16.25 కోట్ల ప్యాకేజీ ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ ప్రధాన కార్యనిర్వాహకఅధికారి (సీఈవో) సలీల్ పరేఖ్.. ఏడాదికి రూ.16.25 కోట్ల జీతం తీసుకోనున్నారు. స్థిరవేతనంగా రూ.6.50 కోట్లు, భత్యాలరూపంలో మరో రూ.9.25 కోట్లను అదనంగా ఏడాది చివరన ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని కంపెనీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు కిరణ్ మజుందార్ వెల్లడించారు. ఇది వరకు ఇన్ఫోసిస్ సీఈవోగా పనిచేసిన విశాల్ సిక్కాకు గత ఏడాది రూ.42.92 కోట్లను చెల్లించారు. మరోవైపు విప్రో కంపెనీ సీఈవో అబిదాలి నిమూచ్‌వాలా ఏడాదికి రూ.12.71 కోట్లను ఆర్జిస్తున్నారు. స్టాక్ ఆప్షన్ల కింద సలీల్‌కు అదనంగా మరో రూ.3.25 కోట్లు ఇవ్వనున్నారు. ఆయన ఐదేళ్లపాటు ఇన్ఫోసిస్‌కు సేవలు అందిస్తారు.


దాణా కేసులో లాలూకి మూడన్నరేళ్ల జైలు శిక్ష21 ఏళ్ల నాటి దాణా కుంభకోణంలో బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్‌కు సీబీఐ కోర్టు మూడున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతోపాటుగా రూ.10 లక్షల జరిమానా కూడా చెల్లించాలని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శివ్‌పాల్‌సింగ్ జనవరి 6న తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆర్నెల్లు అదనంగా జైల్లో గడపాల్సి ఉంటుంది. ఆర్జేడీ చీఫ్ సహా మరో ఏడుగురికి మూడున్నరేళ్ల పాటు జైలు శిక్ష, రూ. 10 లక్షల జరిమానా విధించారు. దేవ్‌గఢ్ ట్రెజరీకి సంబంధించిన కేసులో మరో 15 మందికీ ఐపీసీ, పీసీఏ (అవినీతి నిరోధక చట్టం) కింద ఆర్నెల్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షలను కూడా న్యాయమూర్తి ప్రకటించారు. 


వ్యోమగామి జాన్ యంగ్ కన్నుమూతఅత్యధిక పర్యాయాలు అంతరిక్షయానం చేయటంతోపాటు, చంద్రునిపై నడిచిన ప్రముఖ అమెరికా వ్యోమగామి జాన్ వాట్స్ యంగ్(87) కన్నుమూశారు. కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన హూస్టన్‌లో తన నివాసంలో జనవరి 5న మృతి చెందారని నాసా తెలిపింది. అంతరిక్షయానంలో లెజెండ్‌గా అందరూ పిలిచే జాన్ యంగ్ నేవీ ఆఫీసర్, టెస్ట్ పెలైట్, ఏరోనాటికల్ ఇంజినీర్ కూడా. ఆయన పేరిట అనేక రికార్డులున్నాయి. జెమిని, అపొలోతోపాటు పలు అంతరిక్ష యాత్రల్లో కీలకంగా వ్యవహరించారు. 1965లో నాసా ప్రయోగించిన మొట్టమొదటి మానవ సహిత జెమిని మిషన్‌లో ఆయన కూడా సభ్యుడే. అంతరిక్షంలోకి ఆరుసార్లు వెళ్లి వచ్చిన ఏకైక వ్యోమగామిగా జాన్ రికార్డు నెలకొల్పారు.


సిక్కిం ప్రచారకర్తగా రెహ్మాన్ సిక్కిం రాష్ట్ర ప్రచారకర్తగా ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ నియమితులయ్యారు. గ్యాంగ్‌టక్‌లోని పాల్జోల్ స్టేడియంలో జనవరి 9న జరిగిన రెడ్ పాండా వింటర్ ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్.. ఇక నుంచి ఏఆర్ రెహ్మాన్ సిక్కిం పర్యాటక, వ్యాపార అంశాలలో ప్రచార కర్తగా కొనసాగుతారని ప్రకటించారు. ప్రస్తుతం ఇండియాలో తొలి ఆర్గానిక్ రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకున్న సిక్కింకు రెహ్మాన్ అంబాసిడర్‌గా కొనసాగడం.. ఆ రాష్ట్ర పర్యాటక, వ్యాపార రంగాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని చెబుతున్నారు. 


సంగీత విధ్వాంసురాలు రాధా విశ్వనాథన్ కన్నుమూతకర్ణాటక సంగీత విద్వాంసురాలు రాధా విశ్వనాథన్(83) జనవరి 2న బెంగళూరులో మరణించారు. ఈమె ప్రముఖ గాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి కూతురు.

రాజకీయాల్లోకి రజనీకాంత్ సౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ ఎట్టకేలకు రాజకీయ ప్రవేశంపై అధికారిక ప్రకటన చేశారు. రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అభిమానుల కలలను నిజం చేస్తూ రాజకీయాల్లోకి వస్తున్నట్లు డిసెంబర్ 31న ప్రకటించారు. తమిళనాడులో రాజకీయాలు హీనదశకు చేరుకున్న నేపథ్యంలో ఓ సరైన రాజకీయ వేదిక అవసరం ఉందని.. సొంతగా ఓ పార్టీ పెట్టి ఆ లోటును భర్తీ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు రజనీ తెలిపారు. 

డిప్యూటీ ఎన్‌ఎస్‌ఏగా రాజిందర్ ఖన్నా నిఘా ఏజెన్సీ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ‘రా’ మాజీ చీఫ్ రాజిందర్ ఖన్నా డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు. 2017 ఆగస్టులో అరవింద్ గుప్తా పదవీకాలం ముగిసినప్పటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంటోంది. 1978 బ్యాచ్‌కు చెందిన ఖన్నాకు పాకిస్తాన్ వ్యవహారాలు, ఇస్లాం ఉగ్రవాదంపై పూర్తి అవగాహన ఉంది. కాంట్రాక్ట్ పద్ధతిన ఖన్నా నియామకానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని నియామకాల కమిటీ పచ్చజెండా ఊపినట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ పేర్కొంది. 


విదేశాంగ కార్యదర్శిగా విజయ్ గోఖలేసీనియర్ దౌత్యవేత్త విజయ్ కేశవ్ గోఖలే భారత విదేశాంగ శాఖ కార్యదర్శిగా జనవరి 1న నియమితుల య్యారు. గోఖలే రెండేళ్లపాటు పదవిలో కొనసాగుతారు.



డిసెంబర్ 2017 వ్యక్తులు

ఇన్‌స్పైరింగ్ ఐఏఎస్‌లలో ఇద్దరు తెలంగాణ కలెక్టర్లు 
బెటర్ ఇండియా వెబ్‌సైట్ దేశంలోని స్ఫూర్తిదాయక ఐఏఎస్ అధికారుల జాబితాను రూపొందించింది. మెదక్ జిల్లా కలెక్టర్ భారతి హొలికెరి, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్‌లకు ఈ జాబితాలో చోటు దక్కింది. వినూత్న ఆలోచనలతో కొత్తరకమైన కార్యక్రమాలకు శ్రీకారంచుట్టి, ప్రజల అభ్యున్నతికి కృషి చేశారని వీరిద్దరి గురించి బెటర్ ఇండియా సంస్థ పేర్కొంది. 
భారతి హొలికెరి గర్భిణుల ఆరోగ్య పరిరక్షణ కోసం తీసుకున్న చర్యలను ప్రశంసించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో వైద్యసేవలను మెరుగుపర్చారని పేర్కొంది. మెదక్ జిల్లాను వంద శాతం బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా మార్చారు. 
ఇక రొనాల్డ్ రాస్ గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ ప్రజల అభ్యున్నతికి విభిన్న కార్యక్రమాలను అమలుచేశారు. హరితహారం అమలుచేసి జిల్లాను ఉత్తమ స్థానంలో నిలిపారు. దివ్యాంగ సోలార్ సొసైటీ ఏర్పాటుచేసి దివ్యాంగుల అభ్యున్నతికి కృషి చేశారు. కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తి చేసేలా వినూత్న కార్యక్రమాలు అమలుచేశారు. 


యూజీసీ చైర్మన్‌గా ధీరేంద్ర పాల్ సింగ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్‌గా ప్రొఫెసర్ ధీరేంద్ర పాల్ సింగ్‌ను నియమిస్తూ డిసెంబర్ 22న అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయన ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (నాక్) డెరైక్టర్‌గా ఉన్నారు. ధీరేంద్ర ఐదేళ్లపాటు యూజీసీ చైర్మన్ పదవిలో కొనసాగుతారని సిబ్బంది, శిక్షణ విభాగం (డీఓపీటీ) తెలిపింది. ప్రొఫెసర్ వేద్ ప్రకాశ్ యూజీసీ చైర్మన్‌గా 2017 ఏప్రిల్‌లో పదవీ విరమణ పొందినప్పటినుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. 


ఆమ్నెస్టీ జనరల్ సెక్రటరీగా కుమీ నాయుడు అంతర్జాతీయ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రధాన కార్యదర్శిగా తెలుగు మూలాలున్న దక్షిణాఫ్రికా ఉద్యమకారుడు కుమీ నాయుడు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న బెంగళూరుకు చెందిన సలీల్ షెట్టి 2018 ఆగస్టులో రిటైరయిన తరువాత నాయుడు బాధ్యతలు స్వీకరిస్తారు. 52 ఏళ్ల నాయుడు 2009- 2015 మధ్య కాలంలో గ్రీన్‌పీస్ ఇంటర్నేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా పనిచేశారు. తెలుగు మూలాలున్న తల్లిదండ్రులకు జన్మించినా మిగిలిన భారత సంతతి ప్రజల మాదిరిగానే నాయుడు కూడా తనను నల్లజాతి దక్షిణాఫ్రికా పౌరునిగానే భావించి, తెల్లజాతి పాలకులపై పోరు సాగించారు. చదువుకునే రోజుల్లో అక్కడి ఎమర్జెన్సీ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో పలుమార్లు అరెస్టయ్యారు. 
 

ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ - 2017 జాబితా ప్రముఖ పత్రిక ‘ఫోర్బ్స్ ఇండియా’ 100 మంది సెలబ్రిటీ జాబితాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ మరోసారి తొలి స్థానంలో నిలిచాడు. ఈ మేరకు ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ - 2017 జాబితాను డిసెంబర్ 22న విడుదల చేసింది. అక్టోబర్ 1, 2016 నుంచి సెప్టెంబర్ 30, 2017 మధ్యలో ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌లో అత్యధిక ఆదాయం ఆర్జించినవారి పేర్లతో ఫోర్బ్స్ ఈ జాబితా రూపొందించింది. ఇందులో 232.83 కోట్ల ఆదాయంతో సల్మాన్‌ఖాన్ మొదటి స్థానంలో నిలిచాడు. 170.50 కోట్ల ఆదాయంతో షారూఖ్‌ఖాన్ రెండో స్థానంలో, 100.72 కోట్ల ఆదాయంతో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నారు. 
2017 జాబితా 
  1. సల్మాన్ ఖాన్ - రూ.232.83 కోట్లు
  2. షారుఖ్ ఖాన్ - రూ.170 కోట్లు
  3. విరాట్ కొహ్లీ - రూ.100.72 కోట్లు
  4. అక్షయ్ కుమార్ - రూ.98.25 కోట్లు
  5. సచిన్ టెండూల్కర్ - రూ.82.50 కోట్లు
  6. అమీర్ ఖాన్ - రూ.68.75 కోట్లు
  7. ప్రియాంక చోప్రా - రూ.68 కోట్లు
  8. ఎం.ఎస్.ధోని - రూ.63.77 కోట్లు
  9. హృతిక్ రోషన్ - రూ.63.12 కోట్లు
  10. రవీణ్‌వీర్ సింగ్ - 62.63 కోట్లు
తెలుగు సెలబ్రిటీలు 
  1. పీవీ సింధూ - 13వ స్థానం - రూ.57.25 కోట్లు
  2. రాజమౌళి - 15వ స్థానం - రూ.55 కోట్లు
  3. ప్రభాస్ - 22వ స్థానం - రూ.36.25 కోట్లు
  4. సైనా నెహ్వాల్ - 29వ స్థానం - 31 కోట్లు


దాణా కేసులో లాలూని దోషిగా ప్రకటించిన సీబీఐ కోర్టు 21 ఏళ్లనాటి దాణా కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే ఒక కేసులో ఆయన జైలు శిక్ష ఎదుర్కొంటూ ఉండగా.. డిసెంబర్ 23న మరో కేసులో రాంచీ సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది. అదే సమయంలో మరో మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా(80)తో పాటు ఆరుగురిని నిర్దోషులుగా పేర్కొంది. జనవరి 3న దోషులకు కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. 1991-94 మధ్య కాలంలో దేవ్‌గఢ్ ఖజానా నుంచి రూ. 89.27 లక్షల్ని అక్రమంగా విత్‌డ్రా చేసిన దాణా కేసులో ఈ తీర్పు వెలువడింది. 


నేరెళ్ల వేణుమాధవ్‌పై ప్రత్యేక తపాలా కవర్ అంతర్జాతీయ మిమిక్రీ కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్‌కు తపాలా శాఖ అరుదైన గౌరవం కల్పించింది. మిమిక్రీ కళలో 70 ఏళ్లు పూర్తి చేసుకున్న వేణుమాధవ్ 86వ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయనపై తపాలాశాఖ తెలంగాణ సర్కిల్ ప్రత్యేక తపాలా కవర్‌ను ఆవిష్కరించింది. డిసెంబర్ 26న హైదరాబాద్ జనరల్ పోస్టాఫీసు (జీపీవో)లో నిర్వహించిన కార్యక్రమంలో సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బ్రిగేడియర్ బి.చంద్రశేఖర్ ఈ కవర్‌ను ఆవిష్కరించారు. 


గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీవరుసగా రెండోసారి విజయ్ రూపానీ గుజరాత్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఈ మేరకు డిసెంబర్ 26న నిర్వహించిన కార్యక్రమంలో రూపానీతో గవర్నర్ ఓపీ కోహ్లీ ప్రమాణస్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా నితిన్ పటేల్, మంత్రులుగా మరో 18 మంది ప్రమాణం చేశారు. వీరిలో నితిన్ పటేల్ సహా 9 మంది కేబినెట్ మంత్రులు కాగా.. మిగతా 10 మంది సహాయ మంత్రులు. 
ఇటీవల జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు సాధించి వరుసగా ఆరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 77 స్థానాల్లో గెలుపొందింది.


హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా జైరామ్ ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా జైరామ్ ఠాకూర్ (52) డిసెంబర్ 27న ప్రమాణస్వీకారం చేశారు. షిమ్లాలోని రిడ్‌‌జ గ్రౌండ్‌లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆచార్య దేవవ్రత్.. సీఎంతోపాటుగా మరో 11 మంది మంత్రులతో ప్రమాణం చేయించారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, అగ్రనేత ఎల్‌కే అడ్వాణీతోపాటు రాజ్‌నాథ్, గడ్కరీ, నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 
ఇటీవల జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 68 సీట్లకు గానూ బీజేపీ 44 స్థానాల్లో గెలిచింది. 


ఐఓఏ కొత్త అధ్యక్షుడిగా నరీందర్ బాత్రాభారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) నూతన అధ్యక్షుడిగా నరీందర్ బాత్రా ఎన్నికయ్యారు. డిసెంబర్ 14న జరిగిన ఎన్నికల్లో ఆయనకు 142 ఓట్లు రాగా ప్రత్యర్థి అనిల్ ఖన్నాకు 13 ఓట్లు వచ్చాయి. ఐఓఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నికలు నిర్వహించారు. బాత్రా ప్రస్తుతం అంతర్జాతీయ హాకీ సమాఖ్య చీఫ్‌గా కొనసాగుతున్నారు. ఐఓఏ కార్యదర్శిగా రాజీవ్ మెహతా ఎన్నికవగా, కోశాధికారిగా ఆనందీశ్వర్ పాండే గెలిచారు. నూతన కార్యవర్గం నాలుగేళ్ల పాటు పదవిలో ఉంటుంది.


ఎన్‌ఐఎన్ డెరైక్టర్‌గా డాక్టర్ హేమలతనేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్) నూతన డెరైక్టర్‌గా సీనియర్ డిప్యూటీ డెరైక్టర్ డాక్టర్ ఆర్.హేమలత నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం డిసెంబర్ 14 న ఉత్తర్వులు జారీ చేసింది. గాంధీ మెడికల్ కాలేజీలో వైద్య విద్య పూర్తిచేసిన హేమలత ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పరిధిలోని ఎన్‌ఐఎన్‌లో సీనియర్ సైంటిస్ట్‌గా చేరారు. గర్భిణులు, నవజాత శిశువులకు పౌష్టికాహారం వంటి అంశాలపై పరిశోధనలు చేశారు. పరిశోధన రంగంలో ఆమె అందించిన సేవలకు 2016లో ‘ఫెలో ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సెన్సైస్’, 2017 లో ‘ఫెలో ఆఫ్ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ న్యూట్రిషన్ సెన్సైస్’ అవార్డులు అందుకున్నారు.


బాలీవుడ్ నటుడు నీరజ్ ఓరా కన్నుమూతబాలీవుడ్ నటుడు, రచయిత, దర్శకుడు నీరజ్ ఓరా డిసెంబర్ 14న మరణించారు. ఓరాకు 2016, అక్టోబర్‌లో గుండెపోటు రావడంతో కోమాలోకి వెళ్లిపోయారు. దీంతో ఇంట్లోనే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. సత్య, ఫిర్ హెరా ఫెరి, దౌడ్ వంటి సినిమాలతో ఓరా గుర్తింపు పొందారు. 


రిటైర్‌మెంట్ ప్రకటించిన సోనియా గాంధీఏఐసీసీ అధ్యక్షుడిగా డిసెంబర్ 16న రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షురాలు సోనియాగాంధీ రిటైర్‌మెంట్ ప్రకంటించారు. 1998లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికైన సోనియా 19 ఏళ్ల 9 నెలలు అధ్యక్షురాలిగా ఉన్నారు. సోనియా నాయకత్వంలో 1999 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 114 సీట్లు మాత్రమే గెలుచుకుంది. దీంతో 1999-2004 మధ్యలో లోక్‌సభ ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.
2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ కూటమి విజయంతో సోనియా ప్రధాని కావాల్సి ఉండగా ఆమె విదేశీయురాలు కావడంతో ప్రధాని పదవి చేపట్టలేకపోయారు. దీంతో తన అనుచరుడు మన్మోహన్ సింగ్‌ను ప్రధాని పదవికి ఎంపికచేశారు. 


ఇ-సైకిల్ ప్రచారకర్తగా సల్మాన్‌ఖాన్ ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ సైకిల్ తొక్కనున్నాడు. ఢిల్లీ-మీరట్‌ల మధ్య కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సైకిల్ ట్రాక్‌పై సల్మాన్ ఇ-సైకిల్ సవారీ చేస్తారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు, ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కేంద్రం ఈ ట్రాక్‌ను నిర్మిస్తోందని, దీనికి అంబాసిడర్‌గా సల్మాన్‌ఖాన్ కొనసాగుతారని గడ్కరీ తెలిపారు. నగరంలో చిన్నపాటి దూరాలకు సైకిల్ సవారీని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే సల్మాన్‌ను ప్రచారకర్తగా ఎంపిక చేశారు. ఢిల్లీలో కాలుష్యం స్థాయికి మించి పెరిగిపోవడంతో... డీజిల్, పెట్రోలు వాహనాల సంఖ్యను తగ్గించేందుకు ఈ ట్రాక్‌ను నిర్మిస్తున్నారు. 


‘మిస్ ఇండియా-యూఎస్‌ఏ’గా శ్రీసైని‘మిస్ ఇండియా యూఎస్‌ఏ-2017’ కిరీటం వాషింగ్టన్ రాష్ట్రానికి చెందిన శ్రీసైని (21) అనే విద్యార్థినిని వరించింది. ఈ పోటీలో మొదటి రన్నరప్‌గా కనెక్టికట్‌కు చెందిన వైద్య విద్యార్థిని ప్రాచీ సింగ్ (22), రెండో రన్నరప్‌గా నార్త్ కరోలినాకు చెందిన ఫరీనా నిలిచారు. న్యూజెర్సీలోని రాయల్ అల్బర్‌‌ట్స ప్యాలెస్‌లో డిసెంబర్ 17న మూడు విభాగాల్లో నిర్వహించిన మిస్ ఇండియా యూఎస్‌ఏ పోటీల్లో 24కు పైగా రాష్ట్రాలకు చెందిన దాదాపు 50 మంది పాల్గొన్నారు. కాగా మిసెస్ ఇండియా యూఎస్‌ఏగా ఫ్లోరిడాకు చెందిన క్యాన్సర్ వైద్య నిపుణురాలు కవితా మల్హోత్రా పట్టాని ఎంపికయ్యారు. మొదటి రన్నరప్ టైటిల్‌ను ప్రేరణ, రెండో రన్నరప్ టైటిల్‌ను ఐశ్వర్య సాధించారు. మిస్ టీన్ ఇండియా యూఎస్‌ఏ కిరీటాన్ని న్యూజెర్సీకి చెందిన స్వప్న మన్నం(17) గెలుచుకున్నారు. 


జస్టిస్ స్వతంత్ర కుమార్ పదవీ విరమణ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) చైర్‌పర్సన్‌గా ఐదేళ్లు సేవలందించిన జస్టిస్ స్వతంత్ర కుమార్ డిసెంబర్ 19న పదవీ విరమణ చేశారు. ఆయన తర్వాత ఈ పదవికి ఇంకా ఎవరినీ నియమించలేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ కుమార్ 2012 డిసెంబరు 20న ఎన్‌జీటీ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. అనంతరం అనేక కీలక తీర్పులను వెలువరించి పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడ్డారు. ఢిల్లీలో 10 ఏళ్లు దాటిన డీజిల్, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలను నిషేధించడం, గంగ, యమున నదుల ప్రక్షాళన చేపట్టడం, హిమాచల్ ప్రదేశ్‌లో అక్రమంగా నిర్మించిన హోటళ్లను కూల్చేయడం తదితరాలన్నీ ఈయన తీర్పుల వల్ల జరిగినవే. జమ్మూ కశ్మీర్‌లోని వైష్ణోదేవీ ఆలయానికి రోజుకు 50 వేల కంటే ఎక్కువ మంది భక్తులు వెళ్లడానికి వీల్లేదనీ, అమర్‌నాథ్ వద్ద ప్రజలు గట్టిగా అరుస్తూ శివనామ స్మరణ చేయకూడదని కూడా జస్టిస్ స్వతంత్ర కుమార్ ఆదేశించారు. 


కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడిగా రాహుల్ గాంధీకాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ(47) నియమితులయ్యారు. రాహుల్ తన తల్లి, ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ నుంచి డిసెంబర్ 16న బాధ్యతలు స్వీకరించనున్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా దాఖలైన మొత్తం 89 నామినేషన్లు ఉపసంహరించుకోగా రాహుల్ నామినేషన్ మాత్రమే మిగిలింది. దీంతో ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ నియమితులైనట్లు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ ఛైర్మన్ ఎం.రామచంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు. నెహ్రూ-గాంధీ వారసత్వంలో మోతీలాల్ నెహ్రూ, జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ తర్వాత రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారు. 


ఆలోచనాపరుల జాబితాలో కమలా హ్యారిస్ ప్రపంచ అత్యుత్తమ ఆలోచనాపరుల జాబితాలో భారతీయ అమెరికన్ కమలా హ్యారిస్ అగ్రస్థానంలో నిలిచారు. ప్రఖ్యాత ‘ఫారిన్ పాలసీ మ్యాగజీన్’ 2017 సంవత్సరానికి డిసెంబర్ 5న 50 మంది పేర్లతో ఒక జాబితాను ప్రకటించింది. ఇందులో కాలిఫోర్నియా సెనేటర్‌గా ఉన్న కమలా హ్యారిస్‌తోపాటు భారత సంతతికి చెందిన హసన్ మిన్హాజ్, నిక్కీ హేలీలకు చోటు దక్కింది. 

తూర్పు నౌకాదళ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఎంఎస్ పవార్తూర్పు నౌకాదళానికి నూతన చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఎంఎస్ పవార్ డిసెంబర్ 11న బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ న్యూఢిల్లీలోని ఇంటిగ్రేటెడ్ డిఫెన్‌‌స స్టాఫ్ డిప్యూటీ చీఫ్‌గా బదిలీ అయ్యారు. దీంతో 1978 యూపీఎస్‌సీ బ్యాచ్‌కు చెందిన ఎంఎస్ పవార్ బాధ్యతలు స్వీకరించారు. పవార్ ప్రస్తుతం సీబర్డ్ ప్రాజెక్టు డెరైక్టర్ జనరల్‌గా వ్యవహరిస్తున్నారు. అంతకుముందు గుజరాత్, మహారాష్ట్రలో ఫ్లాగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు. పవార్ 1999 కార్గిల్ యుద్ధం సమయంలో వెస్ట్రన్ ఫ్లీట్‌కు ఫ్లీట్ నేవిగేషన్ ఆఫీసర్‌గా కీలక పాత్ర పోషించారు. ఆయన సేవలకు పరమ విశిష్ట సేవా పురస్కారం లభించింది. 


డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ పితామహుడు లాల్జీ సింగ్ కన్నుమూతప్రముఖ శాస్త్రవేత్త, భారత డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ పితామహుడు లాల్జీ సింగ్ (70) డిసెంబర్ 10న కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాలో జన్మించిన సింగ్ బీహెచ్‌యూలో బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ పూర్తిచేశారు. ఇదే యూనివర్సిటీకి 25వ వైస్‌చాన్స్ లర్‌గా పనిచేశారు.
లాల్జీసింగ్ హైదరాబాద్‌లోని కేంద్ర డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నొస్టిక్స్ (సీడీఎఫ్‌డీ)లో ఓఎస్డీగా (1995-99)కూడా సేవలందించారు. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) వ్యవస్థాపకుల్లో లాల్జీ ఒకరు. ల్యాకోన్‌‌స, జెనోమ్ ఫౌండేషన్ (పేదప్రజలకు జన్యుపరమైన సమస్యలకు చికిత్సనందించే సంస్థ) వంటి పలు సంస్థలను ఆయన స్థాపించారు.
దేశంలో డీఎన్‌ఏ ఆధారంగా పితృత్వాన్ని నిర్ధారించే పరీక్షలను లాల్జీ సింగ్ అభివృద్ధి చేశారు. 1991లోనే డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా డీఎన్‌ఏను కోర్టులో సాక్ష్యంగా ప్రవేశపెట్టడం ద్వారా ఓ పితృత్వ కేసును నిర్ధారించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, పంజాబ్ మాజీ సీఎం బియంత్ సింగ్ హత్య కేసుల్లోనూ మృతుల నిర్ధారణకు ఈ టెక్నాలజీనే ఉపయోగించారు. 
లాల్జీసింగ్ హైదరాబాద్‌లోని సీసీఎంబీ డెరైక్టర్‌గా ఉన్నప్పుడు కృత్రిమ గర్భధారణ పద్ధతుల ఆధారంగా అంతరించిపోతున్న జీవజాతుల సంతతిని పెంచేందుకు లేబొరేటరీ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ ఎన్‌డేంజర్డ్ స్పీషీస్ (ల్యాకోన్‌‌స)ను ఏర్పాటు చేశారు. 


‘మీ టూ’ ఉచ్చులో ట్రంప్ప్రపంచవ్యాప్తంగా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు తమ వివరాలు బహిర్గతం చేస్తున్న ‘మీ టూ’ హ్యాష్ ట్యాగ్ ఉచ్చులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిక్కుకున్నాడు. డిసెంబర్ 12న న్యూయార్క్‌లో జరిగిన సమావేశంలో జెస్సీకా లీడ్‌‌స, రేఛల్ క్రూక్స్, సమంతా హాల్వే అనే మహిళలతో పాటు 16 మంది ట్రంప్ తమపై లైంగికదాడికి యత్నించాడని ఆరోపించారు. తమ అనుమతి లేకుండానే చుంబించడం, సున్నిత ప్రదేశాలను తాకడం వంటి అవాంఛిత చర్యలకు ట్రంప్ పాల్పడ్డారని తెలిపారు.


సీపీసీ సమావేశాలకు ఏచూరీ, సుధాకర్‌రెడ్డిలకు ఆహ్వానంబీజింగ్‌లో జరిగే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) సమావేశాలకు సీపీఎం, సీపీఐ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరీ, సురవరం సుధాకర్‌రెడ్డిలను చైనా ఆహ్వానించింది. ఈ మేరకు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు జరిగే ‘ప్రపంచ రాజకీయ పార్టీలతో సీపీసీ చర్చలు’ సమావేశాల్లో వారు పొల్గొననున్నారు. ఈ సమావేశాలకు 120 దేశాలనుంచి దాదాపు 200 రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరుకానున్నారు.


తెలుగులో సానియా మీర్జా ఆత్మకథభారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆటోబయోగ్రఫీ ‘ఏస్ అగెనైస్ట్ ఆడ్‌‌స’ తెలుగు అనువాదం ‘టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా’ పేరుతో నవంబర్ 29న విడుదలైంది. సానియా కెరీర్ విశేషాలతో కూడిన ఈ పుస్తకంను ‘సాక్షి’ క్రీడా ప్రతినిధి మొహమ్మద్ అబ్దుల్ హాది తెలుగులోకి తర్జుమా చేశారు. 


జీఈఎస్ సదస్సులో స్టార్టప్‌ల చాంపియన్ అజైతా షాహైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో స్టార్టప్‌ల ‘పిచ్’ కాంపిటీషన్‌లో రాజస్తాన్‌కు చెందిన అజైతా షా తుది విజేత (గ్రాండ్ చాంపియన్)గా నిలిచారు. సదస్సును పురస్కరించుకుని స్టార్టప్ కంపెనీలకు ‘గ్లోబల్ ఇన్నోవేషన్ త్రూ సైన్‌‌స అండ్ టెక్నాలజీ (జిస్ట్)’ఆధ్వర్యంలో పిచ్ కాంపిటీషన్‌ను నిర్వహించారు. 
అజైతా షా రాజస్తాన్‌లో ‘ఫ్రాంటియర్ మార్కెట్స్’స్టార్టప్‌ను నిర్వహిస్తున్నారు. సౌరశక్తి వినియోగం, సౌరశక్తి ఆధారిత ఉత్పత్తులను తయారు చేయటంతో పాటు మహిళలకు వ్యాపార అవకాశాలను పెంపొందించేందుకు ఆమె కృషి చేస్తుంది.ఆమెకు దాదాపు 4 లక్షల డాలర్ల విలువైన బహుమతులను అందజేశారు.


ఐరాస ప్రచారకర్తగా దియామీర్జాబాలీవుడ్ నటి దియామీర్జా ఐక్యరాజ్యసమితి పర్యావరణ ప్రచారవేత్తగా నియమితులయ్యారు. భారత్‌లో పర్యావరణ కాలుష్యం, వాతావరణ మార్పులు, సముద్రాల పరిరక్షణ, అడవుల సంరక్షణ తదితర అంశాలపై పలు కార్యక్రమాల ద్వారా ఆమె అవగాహన కల్పించనున్నారు. కేట్ బ్లాంకెట్, అన్నా హాతావే, ఏంజెలీనా జోలీ తదితర హాలీవుడ్ నటులు కూడా పర్యావరణ పరిరక్షణ ప్రచారంలో భాగస్వామ్యులయ్యారు.


మాజీ సీజేఐ ఆదర్శ్ సేన్ ఆనంద్ కన్నుమూతసుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆదర్శ్ సేన్ ఆనంద్ (81) గుండె పోటుతో డిసెంబర్ 1న కన్నుమూశారు. 1936లో కశ్మీర్‌లో జన్మించిన ఆనంద్ లక్నో వర్సిటీ నుంచి లా పట్టా అందుకున్నారు. పంజాబ్, హరియాణా హైకోర్టుల్లో ప్రాక్టీస్ చేశారు. 1975లో కశ్మీర్ హైకోర్టు అదనపు జడ్జీగా నియమితులయ్యారు. 1998-2001 కాలంలో సుప్రీంకోర్టుకు 29వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2003-06 కాలంలో జాతీయ మానవహక్కుల కమిషన్ చైర్మన్‌గా పనిచేశారు. డీకే బసు కేసులో ఖైదీల హక్కులపై ఆయన ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనదిగా పరిగణిస్తారు.


ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా సలీల్ పరేఖ్ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ కొత్త సీఈవో, ఎండీగా సలీల్ ఎస్ పరేఖ్ డిసెంబర్ 2న నియమితులయ్యారు. 2018 జనవరి 2న బాధ్యతలు చేపట్టనున్న పరేఖ్ అయిదేళ్ల పాటు పదవిలో ఉంటారు. ఐటీ సేవల రంగంలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం గల పరేఖ్ ప్రస్తుతం క్యాప్‌జెమినీలో గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో సభ్యుడిగా ఉన్నారు.


బాలీవుడ్ నటుడు శశికపూర్ కన్నుమూతబాలీవుడ్ నటుడు శశికపూర్(79) డిసెంబర్ 4న ముంబైలో కన్నుమూశారు. ఈయన పృథ్వీరాజ్ కపూర్ మూడో కుమారుడు. 1938 మార్చి 18న జన్మించిన శశికపూర్ నాలుగేళ్ల వయసులోనే సినిమాల్లో కన్పించారు. 1961లో ధర్మపుత్ర సినిమాతో హీరోగా ప్రస్థానం ప్రారంభించి 116 చిత్రాల్లో నటించారు. దీవార్, కభీకభీ, నమక్‌హలాల్, కాలాపత్తర్ వంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. శశి కపూర్ 2011లో పద్మభూషణ్, 2015లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందారు.

వ్యవసాయ పథకాలకు ప్రచారకర్తగా అక్షయ్ కుమార్రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన, పరంపరాగత్ కృషి వికాస్ యోజన వంటి వ్యవసాయ పథకాలకు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. టీవీల్లో ప్రకటనల ద్వారా రైతులను చైతన్యవంతం చేయడానికి అక్షయ్‌ను ప్రచారకర్తగా నియమించినట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ డిసెంబర్ 6న తెలిపింది.